- గుండ్లపోచంపల్లిలో 100 అడుగుల ప్లెక్సీతో భారీ నిరసన ర్యాలీ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 24 ప్రధాన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు పోరుబాట పట్టాయి. ఇందులో భాగంగా గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 అడుగుల భారీ ప్లెక్సీపై ప్రదర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, పేదలు, రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటి అమలును పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు దండుకునేందుకు మాత్రమే ఉపయోగించిన రాజకీయ వాగ్దానాలుగా మిగిలిపోయాయని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్నప్పటికీ పేదలు, సామాన్య ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేకం ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ప్రభుత్వ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ప్రస్తుతం నిరాశ, అసంతృప్తి మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని స్పష్టమైన కాలపరిమితితో అమలు చేసి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన బీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యంగా హైడ్రా, 22ఏ తదితర అంశాల కారణంగా సామాన్య ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు.
ప్రజల ఆస్తులు, భూములు, నివాసాల విషయంలో స్పష్టత లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులను అయోమయానికి గురిచేస్తున్నాయని, ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి వారిలో భయాన్ని సృష్టించే పరిస్థితులు నెలకొల్పుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను గుర్తించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో మాజీ కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, అమరం హేమంత్ రెడ్డి, భేరి బాలరాజు, చింత పెంటయ్య, మాజీ సర్పంచ్ లు జగన్ రెడ్డి, శ్రీనివాస్ రాజు, చిట్టిమిల్ల గణేష్, చిట్టిమిల్ల రాగజ్యోతి, బీఆర్‌ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, సంజీవ్ గౌడ్, బట్టికడి దేవేందర్, రామ్ యాదవ్, నర్సింగ్ యాదవ్, మధుసూదన్, శ్రీహరి, విష్ణు, సంతోష్, శివ,సింహాలు, విద్యాసాగర్, నాగరాజు, నరహరి, యువకులు తదితరులు పాల్గొన్నారు.
