- పెరుగుతున్న ఇత్తడి వినియోగం..
అల్యూమినియం తేలికగా, చవకగా ఉండటం వల్ల చాలా మంది వంటగదులలో ఎక్కువగా వీటిని వినియోగిస్తుంటారు. కానీ ఇటీవలి అధ్యయనాలు, నిపుణుల సూచన మేరకు అల్యూమినియం పాత్రలలో వంట చేయడం అంత మంచిది కాదని పదేపదే హెచ్చరిస్తున్నారు. అందువల్ల మంచి ఆరోగ్యం కోసం ఆలోచించేవారు ఇప్పుడు పాతకాలపు ఇత్తడి పాత్రల వినియోగం పెంచుతున్నారు. ఇత్తడి ప్రాథమికంగా రాగి, జింక్‌ల మిశ్రమలోహం. ఇవి శరీరానికి చాలా అవసరం. ఇత్తడి పాత్రలలో ఆహారం లేదా టీ చేయడం వల్ల ఈ ఖనిజాలు కొద్ది మొత్తంలో ఆహారంలోకి విడుదలవుతాయి.
ఇది శరీరంలోని రాగి, జింక్ లోపాలను సహజంగా భర్తీ చేయడానికి సహాయపడుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం రాగి, జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇత్తడి పాత్రలలో తయారుచేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ మరింత చురుకుగా ఉంటుంది.
ఫలితంగా శరీరం చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదా కాలానుగుణ వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలదు. ఇత్తడి విశిష్ట లక్షణాలలో మరొకటి.. అది హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అల్యూమినియంతో పోలిస్తే, ఇత్తడి పాత్రలలోని ఆహారం చాలా ఎక్కువ క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంటుంది. శుభ్రత విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం ఉన్నప్పటికీ ఇత్తడి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం ఇత్తడి తాకిన నీరు లేదా ఆహారం జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట లేదా అజీర్ణంతో బాధపడేవారు ఇత్తడి పాత్రలు ఉపయోగించడం వరం. ఇది ప్రేగుల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడి, జీర్ణక్రియ ప్రక్రియను సహజంగా సాగేలా చేస్తుంది. ఆమ్ల గుణం గల ఆహార పదార్థాలతో అల్యూమినియం కలిసినప్పుడు, అది ఒక రకమైన హానికరమైన విషప్రభావానికి కారణమవుతుంది. కానీ ఇత్తడి పాత్ర లోపలి భాగానికి తగరపు పూత లేదా ‘ప్లటింగ్’ చేసి ఉంటే.. ఇటువంటివి మాత్రమే వినియోగించాలి.
