Homeఆంధ్రప్రదేశ్Tribute | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు

Tribute | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు

  • ఫిబ్రవరి 26… అయ్యదేవర వర్ధంతి

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహా నాయకులలో పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి తదితరులు పేర్కొన తగిన వారు.

అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22, 1881 – ఫిబ్రవరి 26, 1962) స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు మొదటి శాసన సభాధిపతి.

- Advertisement -
Ayyadevara Kaleswara Rao Death Anniversary Significance0

కాళేశ్వరరావు పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించారు. కాళేశ్వరరావు ప్రాథమిక విద్య స్వగ్రామం నందిగామలోనే జరిగింది. ఉన్నత విద్య ఆలస్యంగా 1894-1901లో బందరులో జరిగింది. బందరులో రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి శిష్యులైనారు. వేమూరి రామకృష్ణారావు వద్ద ఇంగ్లీషు అభ్యసించారు. అక్కడ డా.పట్టాభి, ముట్నూరి కృష్ణారావులతో స్నేహం ఏర్పడింది.

ఇంగ్లీషులో లెక్కలలో ప్రావీణ్యం సంపాదించారు. మదరాసు వెళ్లి ఇంజనీరు కావాలనుకున్న కాళేశ్వరరావు కోరిక నెరవేరలేదు. బందరులోనే చరిత్రలో పట్టభద్రులై, కాళేశ్వర రావు ప్రతిభను గుర్తించి ఆయనను అదే స్కూలులో చరిత్ర ఉపాధ్యాయులుగా నియమించారు. 1901-1903 ఉపాధ్యాయుడిగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు.

Ayyadevara Kaleswara Rao Death Anniversary Significance2

1904-1905 సంవత్సరాలలో కాళేశ్వరరావు మదరాసులో లా చదివి న్యాయవాది అయినారు.
జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పని చేశారు.
మదరాసులో కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగంలతో పరిచయం ఏర్పడింది. ఆ కారణంగా సంఘ సంస్కరణోద్యమ బీజం పడింది.

రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభావం వల్ల సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పని చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.

రాజకీయాలతో పాటు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడ లోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిలో కార్యదర్శిగా పని చేశారు.

కారాగారంలో ఉండగా ‘ఫ్రెంచి విప్లవ చరిత్ర’, ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర’, ‘తురుష్క ప్రజాస్వామికం’, చీనా జాతీయోద్యమ చరిత్ర’, ‘ఈజిప్టు చరిత్ర’ అనే పుస్తకాలను రచించారు.

1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజా ప్రతినిధిగా విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఆయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షులుగా, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Ayyadevara Kaleswara Rao Death Anniversary Significance3

1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించారు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వం ఏర్పడగా, దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూప కల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ఉపయోగించి మన్ననలు పొందారు.

1946లో విజయవాడ నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశం పంతులు పక్షం వహించారు. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది. ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నారు. 1947లో కాళేశ్వరరావు శాసన సభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టారు.

స్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యారు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.

శాసన సభాపతిగా శాసనసభలో భాష తెలుగులోనే ఉండాలని 1959 డిసెంబరు 14న రూలింగ్ ఇచ్చారు. 1961 ఆగస్టు 11న సభాపతి అనుమతి లేనిదే సభలో ఎవరైనా ఎలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయరాదని రూలింగ్ ఇచ్చారు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాతు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News