- కలకలం రేపిన భారతీయ విద్యార్థులపై దాడి..
- వారి భద్రతపై సర్వత్రా ఆందోళన..
- ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు వెల్లడి..
ఇటీవల రష్యాలో కొందరు భారతీయ విద్యార్థులపై దాడి ఘటన కలకలానికి దారి తీసింది.. భారతీయ విద్యార్థుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత కొంతకాలంగా రష్యాలోని భారతీయ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో సగానికి పైగా రష్యాలోని భారతీయులవేనని తేలింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, గతేడాది 196 దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల నుంచి విదేశాంగ శాఖకు మొత్తం 350 ఫిర్యాదులు అందాయి. వీటిలో 200కు పైగా రష్యాలోని భారతీయ విద్యార్థుల నుంచి అందినవే. 2023లో రష్యాలో చదువుకుంటున్న భారతీయుల నుంచి 68 ఫిర్యాదులు అందాయి. 2024లో ఫిర్యాదుల సంఖ్య 78కి పెరిగింది. గతేడాది మాత్రం ఈ సంఖ్య ఏకంగా 201కు చేరింది. రాజధాని మాస్కో నుంచే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయ విద్యార్థులు అనేక మంది రష్యాలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, తమిళనాడుకు చెందిన స్టూడెంట్స్ రష్యాలో అధిక సంఖ్యలో ఉన్నారు. తక్కువ ఫీజులతో పాటు అడ్మిషన్ పొందడం సులభం కావడంతో అనేక మంది రష్యా వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇటీవల కాలంలో వేధింపుల ఘటనలు పెరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇతర దేశాల విద్యార్థులు తమపై వివక్ష ప్రదర్శించడం సాధారణంగా మారిందని భారతీయ విద్యార్థులు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వేధింపులు, చిన్న తప్పులకు కాలేజీల నుంచి పంపించేస్తామనే బెదిరింపులు ఎదురవుతాయని తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుందో అనే భయంతో చాలా మంది మిన్నకుండిపోతారని కూడా అన్నారు. ఇక తమ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోరని కూడా అక్కడి విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ల ప్రతినిధులు వాపోయారు.
