- అసంపూర్తిగా ఉండిపోవడంతో ఎన్నో సమస్యలు..
- వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి..
- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..
అంబర్ పేట్ ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రూ.1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 2,800 కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని ఆయన ప్రస్తావించారు. మరో 2,500 కిలో మీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.
తద్వారా తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలు కూడా తక్కువ సమయంలోనే జాతీయ రహదారులతో అనుసంధానించామని.. ఇది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.265 కోట్ల వ్యయంతో ఔఊ163 మీద నగరంలోని అంబర్పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలో మీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్ ను నిర్మించిందని గుర్తుచేశారు.
5 మే, 2025 నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్లై ఓవర్ను ఘనంగా ప్రారంభించారని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనతోపాటుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి 20180 వెంకటరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారని కిషన్రెడ్డి గుర్తుచేశారు. ఈ మార్గంలో ప్లై ఓవరు అవసరమైన భూసేకరణ పూర్తి కాలేదని అన్నారు. దీని నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నప్పటికీ దీని కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదని తెలిపారు.
భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డుతగులుతోండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. మంజూరయినప్పటికీ లేని సమస్యలు సృష్టించి భూసేకరణ పూర్తి కాకుండా కుట్రలు చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగనివ్వకపోవడంతో ఈ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని అప్పటి సీఎం కె. చంద్రశేఖరరావు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి అనేకసార్లు తెలియజేశానని కిషన్రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ మంత్రులకు స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అనేకసార్లు తెలియజేశారని అన్నారు.
జీహెచఎంసీ కమిషనర్, ఇతర సంబంధిత అధికారుల దృష్టికి తాను కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి అనేకసార్లు మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసినప్పటికీ, ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదని చెప్పుకొచ్చారు. భూసేకరణకు సంబంధించిన భూమికి రూ.2.54 కోట్ల పరిహారం లబ్దిదారులకు ప్రభుత్వం చెల్లించినప్పటికీ మధ్య దళారులు అడ్డుకుంటున్నారని అన్నారు.
ఈ విషయంలో సీఎం వ్యక్తిగతంగా చొరవ చూపించి, సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత జీహెచఎంసీ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించటానికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు.
