Sunday, May 31, 2026
HomeజాతీయంAir India | కనుమరుగవుతున్న చివరి ఆనవాళ్లు..

Air India | కనుమరుగవుతున్న చివరి ఆనవాళ్లు..

  • ఎయిర్ ఇండియా ప్రస్థానంలో భావోద్వేగ ఘట్టం..
  • ఇళ్లను ఖాళీ చేసిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు..

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పుట్టిన నగరంలో ఆ సంస్థకు చెందిన చివరి ఆనవాళ్లు కూడా కనుమరుగవుతున్నాయి. ముంబైలోని శాంతాక్రూజ్ ఈస్ట్, కలినాలో ఉన్న చారిత్రక ఎయిర్ ఇండియా ఉద్యోగుల కాలనీల 7 దశాబ్దాల శకం నేటితో (మే 31) ముగిసింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, చివరి నివాసితులు కూడా ఈ కాలనీలను వీడి వెళ్లడంతో, ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ఈ కాలనీల ఖాళీ ప్రక్రియ ఎయిర్ ఇండియా ప్రస్థానంలో ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచిపోయింది.

1955లో నిర్మించిన ఈ కాలనీలు దాదాపు 184 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం నాలుగు కాలనీలలో 106 భవనాల్లో 1,683 ఫ్లాట్లు ఉండేవి. ఒకప్పుడు వేలాది కుటుంబాలతో కళకళలాడిన ఈ ప్రాంగణంలో, చివరిగా మిగిలిన సుమారు 150 కుటుంబాలు నేడు తమ ఇళ్లను ఖాళీ చేశాయి. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగులే. రెండు దశాబ్దాల క్రితం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ కు లీజుకు ఇచ్చిన ఈ భూమిని ఇప్పుడు పూర్తిగా వారికి అప్పగించనున్నారు.

- Advertisement -

2022లో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, యాజమాన్యం ఈ కాలనీలను ఖాళీ చేయమని ఆదేశించింది. అయితే, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లు తమ సర్వీస్ కండిషన్‌లో భాగమని పేర్కొంటూ ఉద్యోగులు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. లేబర్ కోర్టు నుంచి బాంబే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. 2025 నవంబర్ 30 నాటికి ఇళ్లు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. అయితే, పిల్లల చదువులకు ఆటంకం కలగకూడదనే మానవతా దృక్పథంతో, ఆ గడువును అనధికారికంగా 2026 మే 31 వరకు పొడిగించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News