- లోకల్ హాలిడే పేరుతో జాలిడే కథనానికి స్పందన
- పరిమితికి మించి లోకల్ హాలిడేల ప్రకటన
- విచారణ కై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు
- తప్పించుకునే యత్నంలో హెడ్ మాస్టర్ ల మల్లగుల్లాలు
లోకల్ హాలిడే పేరుతో జాలిడేలో ఉపాధ్యాయులు.కూసుమంచి మండలంలోని పలు ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలు హెడ్ మాస్టర్ లు జిల్లా కలెక్టర్ మాట వినకుండా పరిమితికి మించి (నాలుగో లోకల్ హాలిడే)స్థానిక సెలవు మంజూరు చేసిన విషయం పై ఆదాబ్ హైదరాబాద్ లో ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది.ఈ కథనం పై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకి ఆదేశించారు.స్థానిక మండల విద్యాధికారికి తక్షణమే విచారణ నివేదికను అందించాలని కోరారు.
ఇదిలా ఉండగా తప్పు చేసి తప్పించుకోబోయిన కుడితిలో పడిన ఎలుక లాగ మారింది కూసుమంచి మండలంలోని పలు ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలు హెడ్ మాస్టర్ ల పరిస్థితి.ఈ నేపథ్యంలో వేటు పడకుండా తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.దీనిలో భాగంగా మండల విద్యాధికారికి హోళీ సందర్భంగా లేఖ ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చి సెలవు ప్రకటించినట్లుగా అప్పటికప్పుడు విద్యార్థుల చేత లేఖను రాయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే జూలై మాసంలో సీత్లా భవాని,సెప్టెంబర్ నెలలో గణేష్ నిమజ్జనం,ఫిబ్రవరిలో శివరాత్రి మరుసటి రోజున కలిపి మొత్తం మూడు లోకల్ హాలిడేలను కొందరు హెడ్ మాస్టర్ లు ప్రకటించారు.తమ అక్రమాలను ఎవరూ గుర్తించలేరని మార్చి 04న గుట్టుగా హోళీ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాలుగో లోకల్ హాలిడే ను ప్రకటించి ఉపాధ్యాయులు ఎంచక్కా జాలిడేలో ముంగిపోయారు.దీంతో పేద విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టి వేయబడుతుంది.
అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈసిఆర్ (ఎవ్రీ చైల్డ్ రీడ్)కార్యక్రమం కూసుమంచి మండలంలో వెనుకబడిపోయింది. ఇతర ఉన్నతాధికారులను విచారణ అధికారిగా నియమించి విచారణ చేపడితే హెడ్ మాస్టర్ ల అక్రమాలు అన్నీ బట్టబయలు కావడం,వేటు పడటం ఖాయం.
