Homeమహబూబ్‌నగర్‌Indira Family Life Insurance | ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.

Indira Family Life Insurance | ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా.

  • 18 నుంచి 59 ఏళ్ల వారికి అవకాశం.
  • పెద్దగూడెం నుంచి జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియ ప్రారంభం.
  • అర్హులందరూ పథకంలో నమోదు చేసుకోవాలి.
  • ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి: కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం(Indira Family Life Insurance) వనపర్తి జిల్లాలో ప్రారంభమైంది. శనివారం పెద్దగూడెం గ్రామంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జిల్లాలోని 268 గ్రామపంచాయతీలు, 80 మున్సిపల్ వార్డుల్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో నమోదు చేసుకొని ప్రయోజనం పొందాలని కోరారు. పెద్దగూడెం గ్రామానికి ఇప్పటికే 62 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
Indira Family Life Insurance Scheme3

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..

18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గలవారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రతిరోజూ 50 కుటుంబాల చొప్పున నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులు తమ వివరాలతో పాటు నామినీ వివరాలను సమర్పించి నమోదు చేసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుందని, నమోదు అనంతరం సంబంధిత వ్యక్తికి సందేశం అందుతుందని తెలిపారు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ..

గతంలో భూమి ఉన్న రైతులకు మాత్రమే కొన్ని బీమా ప్రయోజనాలు అందేవని, భూమిలేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. పెద్దగూడెం గ్రామంలో సుమారు 950 కుటుంబాలు ఉన్నాయని, ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు పూర్తి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా 55 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అనంతరం ఐదుగురు కుటుంబ సభ్యులకు ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం(Indira Family Life Insurance) నమోదు పత్రాలను ముఖ్య అతిథులు అందజేశారు. ఇందిరమ్మ ప్రచార పత్రంతో పాటు ఖేలో ఇండియా పోటీల గోడపత్రిక, మస్కట్‌ను విడుదల చేశారు. అనంతరం మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, వనపర్తి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్లు మాధవి, శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మధుసూదన్, జడ్పీ సీఈఓ యాదయ్య, డీపీవో రామ మహేశ్వర్, గ్రామ సర్పంచ్ పుష్పలత, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News