Homeఆదిలాబాద్Indiramma Family Life Insurance| ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

Indiramma Family Life Insurance| ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.Indiramma Family Life Insurance
  • ఈ నెల 19న గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు.Indiramma Family Life Insurance
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత (Indiramma Family Life Insurance) కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. కుటుంబానికి జీవనాధారమైన ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పిస్తామని, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల స్థాయిలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్హులైన కుటుంబాలను గుర్తించి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, బీమా పొందే ప్రధాన సభ్యుడి వివరాలు, నామినీ వివరాలతో దరఖాస్తులను సేకరించనున్నట్లు తెలిపారు. నామినీ మైనర్ అయితే వారి సంరక్షకుడి వివరాలను కూడా నమోదు చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆధార్, నామినీ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సేకరించిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో నమోదు చేసి, స్కాన్ కాపీలను సంబంధిత బీమా సంస్థకు పంపించడంతో పాటు, అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరచనున్నట్లు తెలిపారు.

బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారి ద్వారా వివరాలు నమోదు చేసి, సంబంధిత అధికారుల పరిశీలన, జిల్లా స్థాయి ఆమోదం అనంతరం బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తారని వివరించారు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత రూ.5 లక్షల బీమా పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా భద్రతపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ఒక్క కుటుంబం నమోదు కాకుండా మిగిలిపోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

కావున అర్హులైన కుటుంబాలు ఈ నెల 19న నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు అవసరమైన వివరాలతో హాజరై, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News