- గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి..
- GSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర…
వెంకటాపురం(నూగూరు): న్యాయ విద్యతోనే ఆదివాసి చట్టాలు అమలు అవుతాయని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర అభిప్రాయపడ్డారు. శుక్రవారం మండలంలోని కొమరం భీం కాలనీ లో పాటి రాజేష్ అధ్యక్షతన జరిగిన గోండ్వానా సంక్షేమ పరిషత్ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5వ షెడ్యూల్ భూభాగంలో న్యాయ విద్యతోనే ఆదివాసి(Adivasi Rights) చట్టాలు అమలు అవుతాయని, భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల(Gondwana Law College) ఏర్పాటు కు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రానికి పూర్వం, స్వతంత్ర అనంతరం ఆదివాసీ చట్టాలు, కోర్టులు తెలియక పోవడం కారణంగా చారిత్రాత్మక మైన అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
శతాబ్దాలు గా ఆదివాసులు సొంత భూమిపై, అడవి పై, నీటి హక్కులు అడుగుతూ పోరాటాలు చేస్తున్నారని అన్నారు. పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు వచ్చినప్పటికీ వాటిని అమలు చేయమని అడిగే అవగాహన లేక గూడాలకే పరిమితం అవుతున్నారని ఆయన అన్నారు. తమ భూములు వలస గిరిజనేతరులు కబ్జా చేస్తే న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే జ్ఞానం లేక, అరకొర విద్య ఉన్నప్పటికీ హక్కులు, చట్టాలను అమలు చేయమని పాలకులను అడగలేని దుస్థితిలో ఆదివాసీ ప్రజానీకం ఉందని అన్నారు.
కోనేరు రంగారావు కమిషన్ రిపోర్ట్ ప్రకారం 8 లక్షల ఎకరాల ఆదివాసీల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూములను వెనక్కి తెచ్చుకునే అవగాహన, తెలివి లేక, ఎన్నో ఎకరాల భూములను గిరిజననేతరుల పరం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఆదివాసులకు రక్షణగా ఎన్నో చట్టాలు కల్పించినప్పటికీ, వాటిని అమలు చేసే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి ఉపప్రణాళిక పేరుతో వేల కోట్ల రూపాయలు ఆదివాసీల అభివృద్ధి కోసం కేటాయించినప్పటికీ, అవి ఏజెన్సీ గ్రామాలకు చేరడం లేదన్నారు.
ఆ నిధులు ఏ తప్పుడు మార్గంలో వెళ్తున్నాయో ప్రశ్నించే పరిస్థితి, అవగాహన లేదన్నారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే వాళ్లకు ప్రశ్నించే తత్వం రావాలి అంటే, భద్రాచలం కేంద్రంగా గోండ్వానా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. న్యాయ కళాశాల ఏర్పాటు కోసం ఆదివాసి యువత ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తాటి లక్ష్మయ్య, భీమయ్య, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
