- రెండో త్రైమాసికంలో రూ.2,829 కోట్ల ఆదాయం.. 34% పెరిగిన నికర లాభం
- రూ.281 కోట్లకు చేరిన సర్దుబాటు చేసిన నికర లాభం
- 22 లక్షల మందికి వైద్యసేవలు.. 68 శాతానికి పెరిగిన పడకల వినియోగం
బెంగళూరు: ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం(Aster Revenue Growth) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.2,829 కోట్లకు చేరింది. సర్దుబాటు చేసిన నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.281 కోట్లుగా నమోదైంది. నికర లాభాల మార్జిన్ 10 శాతంగా ఉండగా, పెట్టుబడిపై రాబడి 152 బేసిస్ పాయింట్లు పెరిగి 23 శాతానికి చేరింది. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా విలీనం అనంతరం ఉమ్మడి సంస్థగా ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాలివి.
ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్ మాట్లాడుతూ.. జులై 1 నుంచి ఉమ్మడి సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత తొలి 100 రోజుల్లోనే నిర్వహణపరంగా, ఆర్థికంగా పురోగతి సాధించామన్నారు. కాసరగోడ్, నాగర్‌కోయిల్ సహా అభివృద్ధి దశలో ఉన్న హాస్పిటల్స్ ఆదాయం 61 శాతం పెరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ విభాగానికి అంతర్జాతీయ జేసీఐ గుర్తింపు, కాసరగోడ్‌లోని మిమ్స్‌కు ఎన్ఏబీహెచ్ గుర్తింపు లభించాయని పేర్కొన్నారు. వైద్యసేవల నాణ్యత, రోగుల భద్రతతోపాటు ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు కొనసాగిస్తామని చెప్పారు. తిరువనంతపురంలోని ఆస్టర్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో 22 లక్షల మందికి వైద్యసేవలు అందించామని, గత ఏడాదితో పోలిస్తే రోగుల సంఖ్య 12 శాతం పెరిగిందని తెలిపారు. హాస్పిటల్స్‌లో పడకల వినియోగం 65 శాతం నుంచి 68 శాతానికి చేరిందన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సలు 39 శాతం, మూత్రపిండ మార్పిడి చికిత్సలు 31 శాతం, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు 29 శాతం పెరిగాయని వివరించారు. విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య 31 శాతం పెరగగా, ఈ విభాగం ద్వారా ఆదాయం 36 శాతం వృద్ధి చెందిందన్నారు. మాల్దీవులు, గల్ఫ్ దేశాలతోపాటు పశ్చిమ ఆఫ్రికా నుంచి రోగుల రాక పెరిగిందని తెలిపారు.
విలీనం అనంతరం వివిధ హాస్పిటల్స్ మధ్య వైద్య నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా అత్యాధునిక చికిత్సలను విస్తరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు తొలిసారిగా అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ విధానాన్ని ఉపయోగించినట్లు తెలిపింది. బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐలో రోబోటిక్ వెన్నెముక చికిత్సా కేంద్రం, రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్‌లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీలో గర్భస్థ శిశు వైద్య ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇప్పటికే స్థిరపడిన హాస్పిటల్స్ మొత్తం హాస్పిటల్ ఆదాయంలో 73 శాతం వాటాను అందించాయి. ఈ విభాగంలో ఆదాయం 18 శాతం పెరగగా, అభివృద్ధి దశలో ఉన్న హాస్పిటల్స్ 62 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నాడీవ్యవస్థ, క్యాన్సర్, ఎముకలు, కీళ్లు, జీర్ణకోశ సంబంధిత వైద్య విభాగాల్లో రోగుల సంఖ్య పెరగడం ఆదాయ వృద్ధికి దోహదపడిందని సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రత్యేక వైద్య విభాగాల విస్తరణ, పడకల సామర్థ్యం పెంపు, వైద్య నిపుణుల నియామకంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
