- మంత్రి సమక్షంలోనే ఫ్లెక్సీ వివాదం.
- మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి ఫొటో లేకపోవడంతో అభిమానుల ఆందోళన..
- సమావేశంలో తోపులాట, హెచ్చరించిన మంత్రి ఉత్తం.
సూర్యాపేట(Suryapet) కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపు కోసం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఫ్లెక్సీ వివాదం రచ్చకెక్కింది. స్థానిక మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫొటోను ఫ్లెక్సీలో పెట్టలేదంటూ ఆయన అభిమానులు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే ఆందోళనకు దిగారు.
దీంతో సమావేశ మందిరంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో వేణారెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదంటూ అభిమానులు నిర్వాహకులను నిలదీస్తూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ చేసేవారు సమావేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సమావేశం చివర్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..

పార్టీలో చిన్నాచితకా పంచాయతీలు అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేదభావం లేదని, అందరూ సమానమేనని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలోనే వర్గ విభేదాలు బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
