నల్గొండ బై పాస్ రోడ్ నిర్మాణంలో ఎసఎలఎంఐ కంపెనీ అక్రమ మట్టి దందా
- నేషనల్ హైవే 565 విస్తరణ ముసుగులో అక్రమం
- ఎర్రగుంట చెరువును తవ్వేస్తున్న కాంట్రాక్టర్
- సుమారు 60 అడుగుల మేర మట్టి తవ్వకాలు
- చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు
- చెరువు మట్టిని రోడ్ నిర్మాణంలో ఉపయోగిస్తున్న వైనం
- కాంట్రాక్టర్కు సహకరిస్తున్న నేషనల్ హై వే అధికారులు
రహదారులు అన్నవి సమాజాభివృద్ధిలో ప్రధానపాత్ర పోషిస్తాయి.. కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది.. ఎన్నో నిధులు వెచ్చిస్తోంది.. ఇలాంటి కార్యక్రమాల్లో కాంట్రాక్టర్లు, స్థానిక రాజకీయ నాయకులు ములాఖత్ అయ్యి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారు.. నల్లగొండ పట్టణంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్.ఎల్.ఎం.ఐ. ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణంలో అడుగడుగునా అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని వందల కోట్ల విలువైన ప్రాజెక్టులో భారీగా దోపిడి జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అభివృద్ధి పేరిట సాగుతున్న అక్రమ దందాతో నేషనల్ హైవే విస్తరణ ముసుగులో నల్గొండలోని మర్రిగూడ ఎర్రగుంట చెరువును(Errakunta Lake) మట్టి మాఫియా మింగేస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలను కాలరాస్తూ రాత్రింబవళ్లు జేసీబీలతో తవ్వుతున్నారు.. ఈ వ్యవహారంతో వందలాది ఎకరాల పచ్చని వరి చేనులు కళ్లముందే ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో కాంట్రాక్టరుకు నేషనల్ హి వే అధికారులు సహకరిస్తున్నారు.. మైనింగ్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.. ఈ అక్రమ తతంగంపై ‘ఆదాబ్ హైదరాబాద’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడ గ్రామం ఎర్రగుంట చెరువు(Errakunta Lake) అక్రమ తవ్వకాలతో కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. నేషనల్ హైవే విస్తరణ పనుల పేరుతో సాగుతున్న ఈ మట్టి మాఫియా లీలలకు కొందరు అధికారుల అండదండలు పూర్తిస్థాయిలో ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు సాగుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టు సంస్థ పూర్తిగా నల్లరేగడి, ఒండ్రుమట్టి, బంకమట్టి, చప్పుడు, సుద్ద మట్టితో నిర్మాణ పనులు దేవడుతోంది..
ఈ మట్టితో రోడ్డు నిర్మిస్తే నాలుగు రోజులకే గుంతలు పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.. రోడ్డు నిర్మాణనికి వాడుతోన్న నాణ్యత లేని మట్టిని చెరువులు, కాలువలు, రిజర్వాయర్ల నుంచి కాంట్రాక్టర్ కొల్లగొడుతున్నాడు.. కంచనపల్లి, దోమలపల్లి, పానగల్ ఉదయ సముద్రం, బుద్దారం, అనంతారం, సాగర్ రోడ్డులో ఉన్న చెరువుల నుంచి మట్టి రండా చేసి పర్యావరణానికి నష్టం చేసిన కాంట్రాక్ట్ సంస్థపై రెవెన్యూ, మైరింగ్, ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి.. కాగా చెరువుల్లో పూడిక తీసినా ఐదు ఫీట్ల వరకే తవ్వాలనే నిబంధన ఉల్లంఘన జరిగింది.. ఆ తవ్విన మట్టిని రైతులకు పొలాల్లో పోసుకోవడానికి ఉచితంగా ఇవ్వాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోలేదు..
నిబంధనలకు తిలోదకాలు.. అడ్డగోలు తవ్వకాలు :
నేషనల్ హైవే 565 విస్తరణ కోసం మంజూరైన రూ. 516 కోట్ల అభివృద్ధి నిధుల్లో భాగంగా, ఎస్.ఎల్.ఎం.ఐ. కంపెనీ ఎలాంటి మైనింగ్ శాఖ అనుమతులు పొందకుండానే చెరువులో బరితెగించి తవ్వకాలు జరుపుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు, జేసీబీలతో చెరువును సుమారు 60 అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కోట్ల రూపాయలు మామూళ్లుగా చేతులు మారుతుండటంతో స్థానిక రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు మూకుమ్మడిగా కాంట్రాక్టర్కు సహకరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
ఎండిపోతున్న వరి చేనులు.. అన్నదాతల ఆవేదన :
ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాల్లో రైతులు బోరుబావుల మీద ఆధారపడి వరి పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయమే వారి కుటుంబాలకు ఏకైక జీవనాధారం. అయితే, చెరువును ఇష్టానుసారంగా భారీ లోతుకు తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి, చెరువు నీరు ఊరే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఫలితంగా బోరుబావులు వట్టిపోయి, చేతికి అందాల్సిన పచ్చని వరి చేనులు కళ్లముందే ఎండిపోతున్నాయి. అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఆందోళనకు దిగితే.. పోలీసులు రంగప్రవేశం చేసి “కేసులు పెట్టి స్టేషన్లో వేస్తాం” అంటూ రైతులను బెదిరిస్తుండటం అత్యంత దారుణం.

భవిష్యత్లో పెను ముప్పు! :
చెరువును కొన్ని మీటర్ల లోతు వరకు తవ్వడం వల్ల రాబోయే వర్షాకాలంలో భారీ వరదలకు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యే ప్రమాదం మెండుగా ఉంది. అంతేకాకుండా, ఈ భారీ గుంతల్లో పశువులు, అమాయక మనుషులు పడి ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాగే మట్టితో రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల ఎంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
అధికారులు స్పందించి చెరువును కాపాడాలి! :
ప్రజాధనంతో అభివృద్ధి జరగాలే తప్ప, అధికార రాజకీయ నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఈ దోపిడీ వల్ల రైతుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు జోక్యం చేసుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువును నాశనం చేస్తున్న ఎస్.ఎల్.ఎం.ఐ. కంపెనీకి వత్తాసు పలుకుతున్న స్థానిక ప్రజా ప్రతినిథులు, అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎర్రగుంట చెరువును,(Errakunta Lake) రైతుల జీవితాలను కాపాడాలని ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక అధికారులు ఎస్.ఎల్.ఎం.ఐ. కంపెనీకి హితోధికంగా సహకరిస్తు న్నారని అక్కడి బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.. దేశానికి అన్నం పెట్టె రైతన్న ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవాలని కాంట్రాక్టర్ చేస్తున్న దౌర్జన్యాలను అడ్డుకొని, న్యాయం చేయాలని వారు కోరుతు న్నారు.. మరిన్ని వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
