ఆక్రమించిన భూములు తమకే చెందాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన అగ్రకులాలు..
- 1/70 చట్టానికి తూట్లు.. మంత్రి అనుచరుల కనుసన్నలో దందాలు?
- ఆయిల్ పామ్ సాగు ముసుగులో భూములు కబ్జా..
- సాగు హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణాల ఆధిపత్యం..
- గిరిజనులకు భూములుండటం పాపమా..?
- ఈ భూమ్మీద బ్రతికే హక్కు గిరిజనులకు లేదా…?
గిరిజనుల ఓట్లతో గెలిచి, అధికారం చేజిక్కించుకుంటున్న ప్రభుత్వాలు.. గిరిజనులనే రాచి రంపాన పెడుతున్నాయి.. వారికి జీవనాధారమైన భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.. ఇలాంటి దారుణ పరిస్థితి ఇప్పుడు చోటుచేసుకుంది.. ఏకంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఒక సీనియర్ మంత్రి కనుసన్నలలో ఈ అక్రమ వ్యవహారం జరుగుతోందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి..
ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని దమ్మపేట, గనుగులపల్లి, నాగుపల్లి గ్రామాల్లో ఈ దమనకాండ జరుగుతోంది.. ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగ చట్టాలు అటకెక్కిపోతున్నాయా? గిరిజనుల జీవనాధారమైన భూములను అధికార బలంతో, రాజకీయ పలుకుబడితో అన్యాక్రాంతం చేస్తున్నారా? అంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరుగుతున్న దమనకాండ నిదర్శనంగా నిలుస్తోంది.. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన 1/70 చట్టం ఖమ్మం జిల్లా ఏజెన్సీలో కేవలం కాగితాలకే పరిమితమైందా..? అనే తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకప్పుడు గిరిజనేతరుల చెరలో ఉన్న భూములను చట్టబద్ధంగా విడిపించి,(Tribal Land Encroachment) తిరిగి ఆదివాసీలకు అప్పగించిన చారిత్రక పోరాటాల గడ్డ తెలంగాణ.. కానీ నేడు, అదే ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. భారీ ఆయిల్ పామ్ తోటల విస్తరణే లక్ష్యంగా కొందరు అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు గిరిజనుల భూములపై పంజా(Tribal Land Encroachment) విసురుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అడ్డగోలు ఆక్రమణలు :
పెద్దఎత్తున విస్తరించి ఉన్న ఆయిల్ పామ్ తోటల మధ్యలో ఉన్న గిరిజనుల చిన్నచిన్న భూమిని గుంటలుగా టార్గెట్ చేసి, బలవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నీటి మోటార్లు ధ్వంసం, రాకపోకలపై ఆంక్షలు :
తమ భూముల్లోకి వెళ్లే దారులను మూసివేయడం, సాగునీటి మోటార్లు ధ్వంసం చేయడం, గేట్లు ఏర్పాటు చేసి గిరిజనులను ఇబ్బందుల పాలు చేయడం వంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయని స్థానిక ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వనరులు, భారీ వ్యవసాయ యంత్రాలు కలిగిన పెద్ద రైతులు వేగంగా భూములను చదును చేస్తుంటే, సంప్రదాయ వ్యవసాయంపై ఆధారపడే గిరిజనులు తమ సొంత భూముల్లోనే పరాయివారై బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి నెలకొంది.
కౌలు ఒప్పందాల ముసుగులో ఘోర మోసం :
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు కేవలం నామమాత్రపు ఒప్పందాలతో భూములను గుంజుకుంటున్న వైనం విస్మయపరుస్తోంది. మరీ దారుణం ఏమిటంటే కొందరికి ఎకరానికి ఏడాదికి కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి ఐదేళ్లని చెప్పి.. దాన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ పోతున్నారనే విమర్శలున్నాయి. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక పంటలు వేసి, అసలు భూ యజమానులైన గిరిజనుల హక్కులనే శాశ్వతంగా కాలరాస్తున్నారనే వాదనలు బలపడుతున్నాయి.
సాక్షాత్తూ మంత్రి కనుసన్నల్లోనేనా..?
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఈ దారుణాలు జరుగుతుండటం, పైగా ఆయనకు అత్యంత సన్నిహతులు, కుటుంబ సభ్యుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతుండటం ఈ వివాదానికి అత్యంత ప్రాధాన్యతను సంతృపెట్టింది. చట్టాన్ని అమలు చేసి గిరిజనులను రక్షించాల్సిన బాధ్యత కలిగినవారే ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా సంచలనం రేపుతున్నాయి.
తక్షణమే జరగాల్సిన విచారణలు :
దమ్మపేట, గనుగులపల్లి, నాగుపల్లి తదితర గ్రామాల్లోని భూముల అసలు యాజమాన్యం, సాగు హక్కులు, లీజుల ఒప్పందాలపై సిట్టింగ్ అధికారులతో లేదా ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరపాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి.. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి గిరిజనేతరుల ఆధీనంలోకి వెళ్లిన ప్రతి గుంట భూమిని వెనక్కి తీసుకుని బాధితులకు అప్పగించాలి.
రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా చర్యలు :
వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా తప్పు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా “మా భూమి.. మా హక్కు.. మా బతుకు” అని నినదిస్తూ గిరిజనులు చేస్తున్న ఈ పోరాటానికి న్యాయం దక్కేనా? లేదా రాజకీయ పలుకుబడి ముందు చట్టం మరోసారి మోకరిల్లుతుందా?
అసలు విచిత్రం ఏమిటంటే సుమారు 800 ఎకరాల భూమిలో మంత్రిగారకి సంబంధించిన వ్యక్తులు పాగా వేశారు.. ఎంతమంది గిరిజనులు సాగుచేసుకుంటున్నారో ఊహించలేము.. ఇప్పుడు వారందరి జీవితాలు బుగ్గిపాలు చేయబోతున్నారు.. ఆ భూములకు తామే యాజమానులమని సుప్రీం కోర్టు మెట్లెక్కారు.. దాదాపు 500 పైచిలుకు పేజీలతో కోర్టుకు సమర్పించారు.. కొంతమంది తామే వారసులమని చెబుతున్నారు..
గిరిజనులకు అగ్రవర్ణాల వారు ఎలా వారసులవుతారు..? అసలు గిరిజనులకు అగ్రవర్ణాల వారికి సంబంధం ఏమిటి..? గిరిపుత్రులు ఈ భూమ్మీద బ్రతనివ్వడానికి వీలు లేకుండా సుప్రీం కోర్టుకు వెళ్లడం వెనుక దాగున్న అసలు రహస్యం ఏమిటి..? ఈ తతంగం వెనుక పావులు కదుపుతున్న పెద్ద తలకాయలు ఎవరు..? అసలు మంత్రి గారి ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోందా..? ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు.. ఎందుకని..? ఇప్పుడు జరుగుతున్న తతంగంపై గిరిజనులు ఆగ్రహావేశాలతో ఉన్నారు.. వారంతా కలిసి తిరగబడితే రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాల్ ఏర్పడు తుందని విశ్లేషకులు అంటున్నారు..
ఈ క్రమంలో ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరి స్తున్నారు.. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై దృష్టిపెట్టి గిరిజనులకు న్యాయం చేసి ప్రజా ప్రభుత్వం అనే మాటకు సరైన నిర్వచనం చెప్పాలని వారు సూచిస్తున్నారు..
ఈ భూ వివాదానికి సంబంధించిన మరిన్ని సంచలన నిజాలు, సుప్రీకోర్టు వరకు సాగిన లీగల్ వార్ డ్రామా అసలు నిజాలు మరో కథనం ( పార్ట్ – 2 ) ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
