- కాంగ్రెస్ పాలనపై హరీశ్‌రావు(Harish Rao) నిప్పులు
- రూ.600 కోట్ల దొడ్డు బియ్యం వృథా.. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌పై లక్ష కోట్ల అప్పుల భారం
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాణత్యాగాలే దిక్కవుతున్నాయా? బిల్లుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేనే చనిపోవడానికి సిద్ధమంటుంటే.. తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు(Harish Rao) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చచ్చిపోతేనే పనులు అవుతాయా? చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లోని బింగి ఎల్లయ్య గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన డీలర్ల సమస్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టో హామీలేవీ?
రేషన్ డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300 కమిషన్, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చే హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. మూడేళ్లు గడిచినా డీలర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 17,200 మంది డీలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం అధ్యక్షుడికి కనీసం పౌరసరఫరాల శాఖ మంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో డీలర్ల కమిషన్‌ను క్వింటాలుకు రూ.140కు పెంచినట్లు గుర్తుచేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం రూ.300 కమిషన్ ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హామీలనే అమలు చేయడం లేదని విమర్శించారు.
రూ.600 కోట్ల బియ్యం బుగ్గిపాలు!
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనితీరుపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. సన్నబియ్యం పంపిణీ నేపథ్యంలో పాత దొడ్డు బియ్యం నిల్వలను సకాలంలో పరిష్కరించకపోవడంతో గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల్లో భారీగా బియ్యం పేరుకుపోయిందని ఆరోపించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన బియ్యం 16 నెలలుగా నిల్వ ఉండి పురుగులు, ఎలుకల బారినపడి పాడైపోయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయిన బియ్యానికి సంబంధించి ఇప్పుడు పాత స్టాక్ లెక్కల ప్రకారం తూకం వేసి ఇవ్వాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. నిల్వలు పాడై తరుగుదల ఏర్పడితే దానికి డీలర్లను బాధ్యులను చేయడం అన్యాయమన్నారు. సకాలంలో బియ్యాన్ని వేలం వేసి ఉంటే నష్టం తగ్గేదని వ్యాఖ్యానించారు.
లక్ష కోట్ల అప్పుల్లో కార్పొరేషన్?
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దాదాపు రూ.లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. సన్నబియ్యం పంపిణీ, సన్నవడ్ల బోనస్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకుండా కార్పొరేషన్‌పై అప్పుల భారం మోపుతోందని విమర్శించారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి బలహీనపడితే రేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
షోకులకు నిధులు.. డీలర్లకు మాత్రం కొరతా?
కొత్త క్యాంప్ కార్యాలయ నిర్మాణం, కాంపౌండ్ వాల్, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. 17,200 మంది డీలర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వడానికి సుమారు రూ.8.60 కోట్లే అవసరమవుతాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చర్చలకు పిలవాలి.. హామీలు అమలు చేయాలి
రేషన్ డీలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చలకు పిలవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డీలర్లపై వేధింపులు ఆపి, మేనిఫెస్టోలో ఇచ్చిన గౌరవ వేతనం, కమిషన్ పెంపు, మినీ సూపర్ మార్కెట్ల హామీలను అమలు చేయాలని కోరారు.
డీలర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ధరావత్ మోహన్ నాయక్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
