- అందుబాటులో లేని పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం…
- సొంత ఖర్చులతో ఆటో సమకూర్చిన ఆశా కార్యకర్త ఝాన్సీ…
- కందిబండ ఏఎన్ఎం లక్ష్మి చొరవతో సురక్షిత ప్రసవం…
- మేళ్లచెరువు(Mellacheruvu) ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంపై(Negligence) ప్రజల ఆగ్రహం…
హుజూర్ నగర్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నామన్న ప్రభుత్వాల ప్రకటనలు క్షేత్రస్థాయిలో కాగితాలపైనే పరిమితమవుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఒక గర్భిణీ పురిటి నొప్పులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతు ఆసుపత్రికి తీసుకు వస్తే కాపాడాల్సిన స్థానిక ఆసుపత్రి వైద్యలు అందుబాటులో లేకపోవడం(Medical Staff Absence) తీవ్ర కలకలం రేపుతుంది.విధుల్లో ఉండాల్సిన డాక్టర్ తోపాటు కనీసం ఏఎన్ఎం కూడా అందుబాటులో లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అర్ధరాత్రి వేళ అమానుషం…
మేళ్లచెరువు మండల(Mellacheruvu Mandal) కేంద్రానికి చెందిన కళ్లెం వెంకటమ్మ, భర్త చిరంజీవి నిరుపేద దంపతులు.ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వెంకటమ్మకు అకస్మాత్తుగా తీవ్రమైన పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. సమయం గడుస్తున్న కొద్దీ నొప్పులు భరించలేక ఆమె నరకయాతన అనుభవించింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో, తీవ్ర నిరాశలో ఉన్న భర్త చిరంజీవి స్థానిక ఆశా కార్యకర్త ఝాన్సీకి సమాచారం అందించారు. బాధితురాలి దుస్థితిని చూసి చలించిపోయిన ఝాన్సీ వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు.
మానవత్వం చాటుకున్న ఏఎన్ఎం లక్ష్మి
ఆసుపత్రిలో వైద్యుడు, స్థానిక ఏఎన్ఎం అందుబాటులో లేకపోవడంతో ఆశా కార్యకర్త ఝాన్సీ నిరాశ చెందకుండా కందిబండకు చెందిన ఏఎన్ఎం లక్ష్మిని సంప్రదించారు. సమాచారం అందిన వెంటనే లక్ష్మి మానవత్వంతో స్పందించి వెంటనే వెంకటమ్మ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఆశా కార్యకర్త ఝాన్సీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత డబ్బులతో ఆటోను సమకూర్చి బాధితురాలిని మేళ్లచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అందుబాటులో వైద్యాధికారి లేరు. ఆ క్లిష్ట సమయంలో రోగి సమస్యను వినడానికి కూడా వైద్యాధికారి లేకపోవడం విస్మయానికి గురిచేసింది. చివరకు వేరే మార్గం లేక ఏఎన్ఎం లక్ష్మి తన అనుభవంతో చొరవ తీసుకుని ఆసుపత్రిలోనే వెంకటమ్మకు కాన్పు చేశారు.
రెఫరల్స్ పేరిట నరకయాతన
ప్రసవం ముగిసినా ఆ నిరుపేద కుటుంబానికి కష్టాలు తీరలేదు. పుట్టిన పాపాయి విపరీతమైన తక్కువ (1.5 కేజీ) బరువుతో జన్మించడంతో శిశువు ఆరోగ్యం క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం శిశువును తక్షణమే హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ కూడా కనీస సదుపాయాలు లేకపోవడంతో సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రి వైద్యులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే హైదరాబాద్కు తీసుకెళ్లాలని చేతులు దులుపుకున్నారు.
దిక్కుతోచని స్థితిలో నిరుపేద కుటుంబం… స్పందించిన యంత్రాంగం
మేళ్లచెరువులో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి రావడానికే ఆటో ఛార్జీలు లేని ఆ నిరుపేద కుటుంబం, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు ఎలా వెళ్లాలో తెలియక, చేతిలో పైసా లేక జిల్లా ఆసుపత్రి ఆవరణలోనే కన్నీరుమున్నీరుగా రోదించింది.వెంకటమ్మ భర్త ఆవేదనను అర్థం చేసుకున్న ఆశా కార్యకర్త ఝాన్సీ వెంటనే హెల్త్ సూపర్వైజర్లకు ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఈ క్రమంలో వైద్యాధికారులపై ఒత్తిడి పెరగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. పైఅధికారుల ఆదేశాలతో స్థానిక వైద్య సిబ్బంది కదిలి, శిశువుకు తగిన అత్యవసర చికిత్స అందించి ప్రాణాపాయం తప్పించారు. ఇంత జరుగుతున్న మేళ్లచెరువు ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహించే డాక్టర్ సమస్య గురించి తెలుసుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మండల కేంద్రమైన మేళ్లచెరువులో స్థానిక ఏఎన్ఎం, డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకపోతే పేదల ప్రాణాలకు పూచీ ఎవరని నిలదీస్తున్నారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్త ఝాన్సీ సమన్వయస్ఫూర్తితో, మానవత్వంతో వ్యవహరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని, లేదంటే ఘోరం జరిగిపోయేదని స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం(Negligence) వహించిన మేళ్లచెరువు ఆసుపత్రి సిబ్బందిపై తక్షణమే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
