రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’(Ramayana) చిత్రం వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. 2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరగనుంది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించే ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించిన వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఇప్పుడు ‘రామాయణ’(Ramayana) ప్రీమియర్ అక్కడ జరగనుండటం ఈ చిత్ర బృందానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవనుంది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది.
ఈ ప్రీమియర్‌లో భాగంగా సినిమాను 3డీలో ప్రదర్శించనున్నారు. మొత్తం 945 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న థియేటర్లో పూర్తి స్థాయి ప్రేక్షకుల సమక్షంలో స్క్రీనింగ్ జరగనుంది. దీపావళి పండుగ సమయంలో ప్రీమియర్ జరుగుతుండటంతో భారతీయ పండుగ వాతావరణాన్ని లాస్ ఏంజెల్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. రెడ్ కార్పెట్ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు సంప్రదాయ భారతీయ పండుగ దుస్తులు ధరించి రావాలని కోరారు.

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ను నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రెండు భాగాల సినిమాటిక్ ఇతిహాసంగా ‘రామాయణ’ రూపొందుతోంది. తొలి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఐమాక్స్‌లోనూ ప్రదర్శించనున్నారు. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ను సోనీ పిక్చర్స్ నిర్వహించనుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
