- చట్టబద్ధంగా సంపాదిస్తే ఏ సమస్య ఉండదు..
- ఎక్కడ నుంచి వస్తున్నాయన్నది ముఖ్యం..
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి రూ.10 లక్షలకు మించి నగదు జమ(Cash Deposits) చేయకూడదనే నిబంధన ఏదీ లేదు. అంటే మీ దగ్గర చట్టబద్ధంగా సంపాదించిన డబ్బు ఉంటే రూ.10 లక్షలకు పైగా కూడా నగదు డిపాజిట్ చేయొచ్చు. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలిగే ఆధారాలు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రూ.10 లక్షల పరిమితి నగదు డిపాజిట్‌పై నిషేధం కాదు. ఇది ప్రధానంగా ఆదాయపు పన్ను శాఖకు లావాదేవీలను రిపోర్ట్ చేసే పరిమితి.
ఎస్‌ఎఫ్‌టీ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లలో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే బ్యాంకులు ఆ వివరాలను సంబంధిత అధికారులకు నివేదించాలి. ఒక్కసారిగా రూ.10 లక్షలు జమ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒకసారి రూ.3 లక్షలు, మరోసారి రూ.4 లక్షలు, తర్వాత రూ.3 లక్షలు డిపాజిట్ చేసినా మొత్తం రూ.10 లక్షలుగా లెక్కిస్తారు. చిన్న మొత్తాలుగా విడగొట్టి డిపాజిట్ చేయడం ద్వారా రిపోర్టింగ్ నుంచి తప్పించుకోలేరు. ఈ వివరాలు ఆదాయపు పన్ను శాఖకు చెందిన ‘యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్’ లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే రూ.10 లక్షల పరిమితి దాటిందంటే వెంటనే ట్యాక్స్ నోటీసు వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేదే అసలు విషయం. వ్యాపార ఆదాయం, ఆస్తి విక్రయం, గతంలో బ్యాంకు నుంచి తీసుకున్న నగదు వంటి చట్టబద్ధమైన మార్గాల్లో డబ్బు వచ్చినట్లయితే అందుకు సంబంధించిన రికార్డులు భద్రంగా ఉంచుకోవాలి. రసీదులు, ఇన్వాయిస్‌లు, ఆస్తి విక్రయ పత్రాలు, బ్యాంకు విత్‌డ్రా రికార్డుల వంటి ఆధారాలు ఉపయోగపడతాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
