నివాస భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్.. అదే భవనంలో జూనియర్ కాలేజీ
- సర్వే నం. 77లో నిబంధనలకువిరుద్ధంగా వినియోగం?
- 43.2 చ.మీ. డివియేషన్ గుర్తించిన అధికారులు..
- విద్యార్థులతో నడుస్తున్న భవనంపై భద్రతా ప్రశ్నలు..
- పట్టణ ప్రణాళికా విభాగం పర్యవేక్షణపై అనుమానాలు..
- భవనాన్ని భౌతికంగా తనిఖీ చేయాలంటున్న స్థానికులు..
- సర్టిఫికెట్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్..
కాగితాలపై ఒక రూపు.. క్షేత్రస్థాయిలో మరో తంతు! మేడ్చల్ మున్సిపాలిటీ(Medchal Municipality) పరిధిలో అధికారుల పర్యవేక్షణ లోపానికి, అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనంగా నిలిచే ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ రికార్డుల్లో నివాస గృహం కోసం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొంది, అదే భవనంలో ఏకంగా ఒక విద్యా సంస్థను నిర్వహిస్తున్న వైనం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల కనుసన్నల్లోనే ఈ తంతు నడుస్తోందనే ఆరోపణలు వ్యూహాత్మకంగా బలపడుతున్నాయి.
మేడ్చల్ గ్రామం మరియు మండలం పరిధిలోని సర్వే నంబర్ 77 (ప్లాట్ నంబర్లు 57/భాగం, 58, 59, 60/భాగం) లోని భవన నిర్మాణంపై వివాదం ముదురుతోంది. సూర్యనగర్, జైత్ర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఈ భవనానికి 2025 మే 23న భవన నిర్మాణ అనుమతి మంజూరు కాగా, 2026 ఏప్రిల్ 6న కేవలం నివాస వినియోగం కింద మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయబడింది. కానీ, అదే భవనంలో ప్రస్తుతం ‘శ్రీ విద్య ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆధ్వర్యంలో ‘త్రివిద్య జూనియర్ కాలేజీ’ కార్యకలాపాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నాయి. ఒక వైపు నివాస భవనంగా మున్సిపల్ అనుమతులు పొంది, మరోవైపు దాన్ని వాణిజ్య మరియు విద్యా అవసరాలకు మళ్లించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

జరిమానాలతో సరిపెట్టే తంతు! : ఇక ఈ భవన నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను పరిశీలిస్తే అధికారుల ఉదాసీన వైఖరి స్పష్టమవుతోంది. మంజూరైన ప్లాన్ ప్రకారం భవన నిర్మిత విస్తీర్ణం 1,164.09 చదరపు మీటర్లు కాగా, కంప్లీషన్ ప్లాన్ వచ్చేసరికి అది 1,207.2892 చదరపు మీటర్లకు పెరిగింది. ?దీనివల్ల సుమారు 43.2 చదరపు మీటర్ల డివియేటెడ్ బిల్ట్-అప్ ఏరియా ఏర్పడినట్లు సర్టిఫికెట్‌లోనే స్పష్టంగా పేర్కొన్నారు. ?దీనికి సంబంధించి రూ.3,61,671/- కంపౌండింగ్ ఫీజు వసూలు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప, భవన అసలు వినియోగ ఉద్దేశాన్ని మార్చడంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమ్యస్థానం లేని పాలనకు అద్దం పడుతోంది.
అక్రమ మార్పిడి : నివాస ప్రాంతాల్లోని భవనాలను విద్యా, వాణిజ్య సంస్థలకు కేటాయించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ల్యాండ్ యూజ్ కన్వర్షన్ మరియు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. నిబంధనలను తుంగలో తొక్కి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న యంత్రాగం పట్టించుకోకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
పర్యవేక్షణా లోపం : ఒక వైపు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కళాశాల నడుస్తుంటే, స్థానిక మున్సిపల్ అధికారులకు ఆ విషయం తెలియకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
ప్రమాదాల ముప్పు : నివాస భవనాలకు ఉండే ప్రమాణాలు, పార్కింగ్ వసతులు వేరుగా ఉంటాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విద్యా సంస్థలను నివాస భవనాలలో నడిపించడం భద్రతాపరంగా తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తక్షణమే తీసుకోవాల్సిన కఠిన చర్యలు : మేడ్చల్ మున్సిపల్ అధికారులు తక్షణమే సదరు భవనాన్ని భౌతికంగా తనిఖీ చేసి, వాస్తవ పరిస్థితులపై నివేదిక సిద్ధం చేయాలి. తప్పుడు సమాచారంతో నివాస గృహమంటూ సర్టిఫికెట్ పొంది, వాణిజ్య/విద్యా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు రుజువైతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తక్షణమే రద్దు చేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యంపై, ఇందుకు సహకరించిన సిబ్బందిపై చట్టపరమైన మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసు కోవాలి. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన మున్సిపల్ యంత్రాగం ఇలాంటి అక్రమాల పట్ల మౌనం వహిస్తే ప్రజా ప్రయోజనాలు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉంది. ఇప్పటి కైనా అధికారులు స్పందించి నిష్పక్షపాత విచారణ జరిపించి, వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
