- లూకేఫ్ ప్రాజెక్ట్‌పై నీలినీడలు! వెల్లువెత్తుతున్న విమర్శలు..
- మూసుకున్న టాయిలెట్లు..కాసుల వర్షం కురిపిస్తున్నకియోస్క్లు..
- జీహెచఎంసీ ‘లూకేఫ’ గుట్టు రట్టు!
- ప్రభుత్వ స్థలం.. ప్రైవేట్ కు కాసుల వర్షం..
- లూకేఫ్ ప్రాజెక్ట్‌లో అంతుచిక్కని అంకెల గారడీ!
- పబ్లిక్ హైజీన్ పేరిట దందా.. స్టోర్ రూములుగా మారిన టాయిలెట్స్..
- సామాన్యుడికి మూసుకున్న తలుపులు..
- ప్రైవేట్ వ్యాపారులకు తెరుచుకున్న ఖజానా.. !
- మరుగుదొడ్ల ప్రాజెక్ట్‌లో అధికారుల మౌనం ఎందుకు?
మరుగుదొడ్లను సైతం అక్రమార్జనకు మార్గంగా ఎంచుకుంటున్న దౌర్భాగ్యం ఇప్పుడు భాగ్యనగరంలో చర్చనీయాంశం అవుతోంది.. హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దితూ.. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం అంటూ ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిష్టితులు ఇందుకు వ్యతిరేకంగా కనిపిస్తు న్నాయి.. ప్రజల కాల కృత్యాలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు అవినీతికి ఆలవాలంగా మారి పోయాయి.. ఎంతో సత్సంకల్పంతో ప్రారంభమైన ప్రతిష్టాత్మక లూకేఫ్ ప్రాజెక్టు(Loo-Cafe Project) విమర్శల్లో కూరుకుపోయింది..
ప్రజల సౌకర్యార్ధం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుండటం దౌర్భాగ్యం.. నిత్యా జీవనంలో కాలకృత్యాలు తీర్చుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైనది.. నగరానికి పాలు ప్రాంతాల నుంచి ఎంతోమంది వివిధ పనుల మీద వస్తుంటారు.. అత్యవస పరిస్థితుల్లో వినియోగించు కోవాల్సిన మరుగుదొడ్లు నిరుపయోగంగా పది ఉండటం.. ప్రజల సొమ్ము హారతి కర్పూరంలా కరిగిపోవడం, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుండటం.. దురదృష్టం.. ఇలాంటి ప్రాజెక్టులపై ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ కొరవడటం.. ప్రైవేట్ వ్యక్తులతో లోపాయికారి ఒప్పొందం కుదుర్చుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.. భాగ్యనగరంలో బరితెగించి లూకేఫ్ చేస్తున్న లూటీపై ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

నగరంలో పబ్లిక్ హైజీన్ పెంచాలనే సత్సంకల్పంతో ప్రారంభించిన ప్రతి ష్టాత్మక ‘లూకేఫ’ ప్రాజెక్ట్(Loo-Cafe Project) ఇప్పుడు తీవ్ర విమర్శలపాలవుతోంది. ప్రజా సౌకర్యాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, నిధులు చివరకు కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల వ్యాపార సామ్రాజ్యానికి అడ్డాగా మారుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాజెక్ట్ పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో విచిత్రమైన పరిస్థితి :
టాయిలెట్లకు తాళం.. కియోస్క్‌లు సాక్షాత్కారం!.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లూకేఫ్ కేంద్రాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాల్సిన మరుగుదొడ్లకు తాళం వేసి ఉండగా, అదే ప్రాంగణంలోని కియోస్క్‌లు మాత్రం నిరంతరం వాణిజ్య కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అంటే, సామాన్యులకు మూసుకున్న తలుపులు.. ప్రైవేట్ వ్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయనే ఆరోపణలు బలపడుతున్నాయి.

అంతుచిక్కని అంకెల గారడీ : ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లెక్కల్లో జిల్లాల వారీగా, సంవత్సరాల వారీగా తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం, జీహెచఎంసీ పరిధిలో కేవలం 66 లూకేఫ్ యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులో ‘ఇక్సోరా’ సంస్థ 20 యూనిట్లు అమలు చేయగా, మరో 15 యూనిట్లను స్వయంగా నిధులు సమకూర్చుకున్నట్లు పేర్కొంది.

కానీ, నేడు లూకేఫ్ అధికారిక వెబ్సైట్ మాత్రం హైదరాబాద్/ జీహెచఎంసీ పరిధిలో ఏకంగా 270కి పైగా లొకేషన్లు ఉన్నా యని, 2018 నుంచే జీహెచఎంసీతో భాగస్వామ్యం కొనసాగు తోందని చెబుతోంది. అసలు 2020లో ఉన్న 66 యూనిట్లు కొద్ది కాలంలోనే 270కి పైగా ఎలా పెరిగాయి? ఏ సంవత్సరంలో ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వర్క్ ఆర్డర్లు, లీజ్ ఒప్పందాలు ఎక్కడున్నాయి..? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం కరవయింది.
ప్రభుత్వ స్థలం.. ప్రైవేట్ వారికి కాసుల వర్షం : సుమారు రూ. 4 కోట్ల 50 లక్షల విలువైన 15 ఏళ్ల ఒప్పందం కింద ఈ ప్రాజెక్ట్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తలెత్తుతున్న ప్రధాన ప్రశ్నలు ఏమిటంటే.. అసలు కిరాయి ఎవరు కడుతున్నారు? అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించినప్పుడు, ఆ స్థలానికి సంబంధించిన లీజ్ లేదా అద్దెను ఎవరు వసూలు చేస్తున్నారు? ఆ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోందా? లేక ప్రైవేట్ సంస్థ జేబులోకి వెళ్తుందా? ఈ ప్రాంగణంలో నడిచే కియోస్క్‌లు, భారీ ప్రకటన బోర్డులు, పబ్లిసిటీ ద్వారా వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం ఎవరికి చెందుతోంది? జీహెచఎంసీకి ఇందులో వాటా ఎంత? అధికారుల పర్యవేక్షణ అనేది ఎక్కడ అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది..

ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలంలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నా, మరుగుదొడ్లు మూత పడినా జీహెచ్ ఎంసీ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? తనిఖీలు లేవు, జరిమానాలు అంతకంటే లేవు. ఇది కేవలం పర్య వేక్షణ లోపమా? లేక అధికారులు, ప్రైవేట్ సంస్థ మధ్య ఏదైనా లోపాయికారి ఒప్పొందం ఉందా..? అన్నది అంతుపట్టకుండా ఉంది..
సమగ్ర విచారణ అత్యవసరం : ఇది కేవలం కొద్ది మరుగుదొడ్ల నిర్వహణ సమస్య మాత్రమే కాదు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు, ప్రజల వసతులు, ప్రైవేట్ వాణిజ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్న పెద్ద కుంభకోణం కోణంలో దీనిని పరిశీలించాల్సి ఉంది. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్న ఈ ఒప్పందాలపై, లూకేఫ్ ప్రాజెక్ట్‌లోని(Loo-Cafe Project) ప్రతి సైట్‌కు సంబంధించిన రికార్డులపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను కాపాడాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జీహెచఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
