1 రెవెన్యూ రికార్డులు-పరిశీలించకుండానే నిర్మాణ అనుమతులా?
- సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందే కబ్జా పర్వం
- నిర్మాణ అనుమతులకు సంబంధిత ఎనఓసీ తీసుకున్నారా?
- రెవెన్యూ`మున్సిపల్ అధికారుల తీరుపై అనుమానాలు
- అక్రమ అనుమతులపై విచారణకు స్థానికుల డిమాండ్
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయానికి(Saroornagar Tahsildar Office) కూతవేటు దూరంలో ప్రభుత్వ భూమిగా నమోదైన సర్వే నంబర్లలోనే నిర్మాణాలకు అనుమతులు జారీ అయ్యాయన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు ఇప్పుడు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తున్నాయి..
తెలంగాణలో ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడుతామని, అన్యాక్రాంతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పాలకులు నిత్యం ఉద్ఘాటిస్తుంటారు. కానీ, అధికారుల పర్య వేక్షణ లోపమో లేక అక్రమార్కులతో లాలూచో తెలియదు కానీ, అన్యాక్రాంతం కాకూడదన్న ప్రభుత్వ ఆస్తులే నేడు అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుం టున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో వెలుగు చూసిన అత్యంత వివాదాస్పద ఉదంతం. ‘ఇంట్లో ఈగలు తోలుకుంటూ.. రాజ్యాలు ఏలినట్లు’ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భూమి రక్షణను గాలికి వదిలేసిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు.. అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.(epaper.aadabhyderabad.in)

సర్వే నంబర్ల మాయాజాలం.. ప్రభుత్వ భూమికి ఎసరు!
సరూర్‌నగర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణపై మరోసారి తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి. సరూర్‌నగర్ గ్రామంలోని పాత సర్వే నంబర్ 9/1, కొత్త సర్వే నంబర్ 9/6లోని భూమికి సంబంధించి ఏకంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరైనట్లు వస్తున్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. సంబంధిత రికార్డుల ప్రకారం, సర్వే నంబర్ 9 మొత్తం 569 ఎకరాల 33 గుంటల విస్తీర్ణం ఉండగా, అందులో 245 ఎకరాల 14 గుంటలు ప్రభుత్వ భూమిగా, 324 ఎకరాల 19 గుంటలు పట్టా భూమిగా నమోదై ఉంది.
అలాగే సర్వే నంబర్ 9/5లో 14 ఎకరాల 31 గుంటలు, 9/6లో 22 ఎకరాల 07 గుంటలు అబ్దుల్ మజీద్ ఖాన్ పేరుతో ఉన్నట్లు రికార్డులను ఆధారంగా చూపుతున్నారు. ?ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో, భూమి ప్రభుత్వ భూమా లేక ప్రైవేటా అనే పూర్తి స్థాయి ధ్రువీకరణ రెవెన్యూ అధికారుల నుంచి తీసుకోకుండానే భవన నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, డాక్టర్స్ కాలనీ, సరూర్‌నగర్ గ్రామంలోని ప్లాట్లు 1 నుంచి 8 వరకు, సుమారు 7,914.93 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత భవన అనుమతి ఫైల్ నంబర్ 007002/ జీహెచఎం సీ/3485/ఎల్బీఎన1/2022-బీపీ, పర్మిట్ నంబర్ 4252/ జీహెచఎంసీ/ఎల్బీఎన్/2022-బీపీ, తేదీ 24 నవంబర్ 2022గా పేర్కొన్నారు.? ’దొంగిలించడంలో నేర్పరి..
దొరకడంలో అడ్డంగా’ అన్నట్లుగా, అసలు ప్రభుత్వ భూమి వర్గీకరణ ఏమిటో స్పష్టత లేకుండా, పట్టా హక్కుల ఆధారాలు సరిగా పరిశీలిం చకుండా బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారనేది అధికారులకే తెలియాలి. ప్రస్తుతం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి ఎల్బీనగర్ జోన్ రావడం జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని అనుమతుల జారీ తీరుపై మరింత లోతైన పరిశీలన జరగాల్సిన అవసరం ఉంది.
తహసీల్దార్ కార్యాలయం జోక్యం తప్పనిసరి..
ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ రికార్డులు, భూమి వర్గీకరణ, పట్టా హక్కులు, మ్యూటేషన్ వివరాలు, ప్రభుత్వ భూమి కేటాయింపు లేదా బదలాయింపు ఉత్తర్వులు ఉన్నాయా లేదా అనే అంశాలపై సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ‘ఉప్పు నమ్మినవాళ్లు అడవి పాలైనట్లు’ ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమై, ఖజానాకు భారీ నష్టం వాటిల్లడం ఖాయం.

ఈ వివాదంపై ప్రధానంగా కింది అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి:
- భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా అనే అంశంపై సరైన ధ్రువీకరణ జరిగిందా?
- తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నారా?
- ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు చట్టబద్ధంగా కేటాయించిన ఆధారాలు ఉన్నాయా?
- కేవలం మ్యూటేషన్ ఆధారంగానే యాజమాన్య హక్కు కల్పించి చేతులు దులుపుకున్నారా?
- భూమి టైటిల్ స్పష్టత లేకుండానే నిర్మాణ అనుమతి జారీ చేయడం వెనుక ఎవరున్నారు?
కేవలం మ్యూటేషన్ నమోదు మాత్రమే యాజమాన్య హక్కును సృష్టించదు అనేది చట్టసత్యం. అయినప్పటికీ, సంబంధిత రెవెన్యూ రికార్డులను పూర్తిగా పరిశీలించకుండా ప్రభుత్వ భూమిపై నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో పెద్ద స్థాయిలో భూవివాదాలు, మూడో వ్యక్తుల హక్కుల జోక్యం పెరిగి ప్రభుత్వానికి తీరని ఆర్థిక నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది.
వెంటనే సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలి
ఈ వ్యవహారంలో రెవెన్యూ, సర్వే, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి స్థలాన్ని సర్వే చేసి ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించాలి. ఒకవేళ అక్కడ నిర్మాణం కొనసాగుతున్నట్లయితే వెంటనే పనులు నిలిపివేయడంతో పాటు, ఆ అనుమతుల చట్టబద్ధతను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫిర్యాదులో కోరినట్లుగా భవన అనుమతి రద్దు, ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, అక్రమ మ్యూటేషన్‌లపై విచారణ జరపడం అత్యంత కీలకం. ప్రభుత్వ భూమి విషయంలో సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఇకనైనా నిద్రమత్తు వదిలి ఏం చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు స్థానికుల్లో ప్రధాన చర్చనీయాంశమైంది.
రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా స్పష్టంగా ఉన్న భూమి ప్రైవేటు నిర్మాణాల పరం ఎలా అయింది? నిర్మాణ అనుమతులు ఇచ్చే ముందు రెవెన్యూ రికార్డులను కనీసం పరిశీలించారా? పరిశీలిస్తే దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారులు ప్రజాసమూహం ముందు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజా ప్రయోజనాన్ని, ప్రభుత్వ ఆస్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
