నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై రంగాపూర్‌కు చెందిన ఆలే సత్యనారాయణ అలియాస్ సత్తిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై కురుమూర్తి మాట్లాడుతూ…
సత్యనారాయణ గత మూడేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతానికి చెందిన లఖన్ అలియాస్ లాలా, సునీత నుంచి కిలోల కొద్దీ గంజాయిని కొనుగోలు చేస్తున్నాడు. అనంతరం దానిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నాగర్‌కర్నూలు జిల్లా వ్యాప్తంగా, సమీప ప్రాంతాల్లో యువకులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారన్నారు, ఒక్కో ప్యాకెట్‌ను రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తూ యువతను గంజాయి అలవాటుకు బానిసలుగా మారుస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎస్సై కురుమూర్తి తెలిపారు.అంతే కాకుండా గంజాయిని కొనుగోలు చేసినా, వినియోగించినా, విక్రయించినా సంబంధితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
