Homeఅంతర్జాతీయంNuclear | అణు బాంబు నీడలో మానవ జీవితం

Nuclear | అణు బాంబు నీడలో మానవ జీవితం

  • అణు వ్యతిరేక ఉద్యమం అనివార్యం
  • ఆగస్టు 29… అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ చరిత్రలో అణుశక్తి మానవ మేధస్సు ఆవిష్కరణకు ప్రతీకగా నిలిచినప్పటికీ, అదే శక్తి మానవ నాగరికతను నాశనం చేసే భయంకర శక్తిగా కూడా పరిణమించింది.

ప్రపంచ శాంతి, మానవ రక్షణ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలు నేటి యుగంలో అత్యంత ప్రాధాన్యం సంతరించు కున్నాయి. అణు ఆయుధాలు మానవజాతికి శక్తి, ఆధిపత్యం, సాంకేతిక ప్రగతి యొక్క చిహ్నాలుగా భావించ బడినా వాటి విధ్వంసకర శక్తి ప్రపంచాన్ని పునరావృతంగా ఆలోచించేలా చేస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 29న అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం జరుపు కుంటారు.

- Advertisement -

1991లో కజాఖ్‌స్తాన్‌ లోని సెమిపాలటిన్స్‌క్ అణు పరీక్షా క్షేత్రం మూతపడిన రోజు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 2009 డిసెంబర్ 2న తీర్మానం ఆమోదించి ఈ దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ నిర్ణయం అణు పరీక్షలు మానవ జాతిపై మోపిన విపరీతమైన దుష్పరిణామాలను స్మరింప జేయడమే కాక భవిష్యత్తులో అణు ముప్పులను నివారించే ప్రయత్నాలకు ఒక బలమైన ఆహ్వానం.

ప్రపంచ చరిత్రలో అణు పరీక్షల మొదటి దృశ్యం 1945 జూలై 16న అమెరికా న్యూ మెక్సికోలోని అలమోగోర్డోలో “ట్రినిటీ” పేరిట జరిగిన ప్రయోగమే. తరువాత అదే సంవత్సరం జపాన్‌పై హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులు ప్రయోగించ బడినప్పుడు ప్రపంచం అణు శక్తి యొక్క భయానకతను ప్రత్యక్షంగా చూచింది. ఆ ఘోర వినాశనం లక్షలాది ప్రాణాలను బలి తీసుకున్నదే కాక తరతరాల పాటు ఆ ప్రాంతాల్లో వికలాంగత్వం, కేన్సర్లు, పర్యావరణ కాలుష్యం వంటి అపరిమిత కష్టాలను మిగిల్చింది.

ఆ తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా తదితర దేశాలు యుద్ధ కాలంలో ఆధిపత్య పోరులో భాగంగా వందలాది అణు పరీక్షలు జరిపాయి. ఈ పరీక్షలు కేవలం ఎడారులు, సముద్రాలు, భూమి గర్భానికే పరిమితం కాలేదు; వాటి ప్రభావం వాతావరణంలో రేడియోధార్మిక కణాలుగా వ్యాప్తి చెంది మానవ ఆరోగ్యం, పర్యావరణ సమతుల్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,000కి పైగా అణుపరీక్షలు జరిగాయి. వీటిలో అమెరికా 1,030, సోవియట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, బ్రిటన్ 45, చైనా 45, భారత్ 6, పాకిస్తాన్ 6, ఉత్తర కొరియా 6 పరీక్షలు జరిపాయి. ప్రతి పరీక్ష వాతావరణంలో విష రసాయనాలు, రేడియేషన్ విడుదల చేస్తూ జీవవైవిధ్యాన్ని ముప్పుకు గురిచేసింది.

సంవత్సరాలుగా అణు పరీక్షల వ్యతిరేకంగా ప్రజల నిరసనలు ఉధృతమయ్యాయి. జపాన్‌లో అణుబాంబు బాధితులు, శాంతి కార్యకర్తలు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు నడిపారు. ఈ నేపథ్యంలో 1963లో అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్‌లు “పాక్షిక అణు పరీక్షా నిషేధ ఒప్పందం”పై సంతకం చేసి భూమి మీద, వాతావరణంలో, నీటిలో పరీక్షలను నిషేధించాయి. అయితే భూగర్భ పరీక్షలకు మాత్రం అవకాశం ఇచ్చారు.

తదనంతరం 1996లో సమగ్ర అణు పరీక్షా నిషేధ ఒప్పందం (CTBT) రూపొందినా అది అమల్లోకి రాలేదు, ఎందుకంటే అణు శక్తివంతమైన కొన్ని దేశాలు దానిని అనుమోదించలేదు. అయినప్పటికీ, ఆ ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో అణు నియంత్రణకు ఒక ప్రధాన పునాది వేసింది. భారతదేశం 1974లో “స్మైలింగ్ బుద్ధా” పేరిట మొదటి అణుపరీక్ష, 1998లో పోఖ్రాన్-II పేరిట ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. అయితే భారత్ ఎల్లప్పుడూ “ప్రథమంగా అణ్వస్త్ర వినియోగం చేయమని” (No First Use Policy) స్పష్టంగా ప్రకటించింది. ఈ విధానం ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తుంది.

అణు పరీక్షల ప్రభావం మానవ జీవితంలో అనేక కోణాలలో ప్రతిఫలించింది. భూగర్భ పరీక్షల వల్ల భూకంపాలు, భూగర్భ జలాల కలుషితం, నేల పాడైపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సముద్ర పరీక్షలు సముద్ర జీవ సంపదపై ఘోర ప్రభావం చూపాయి. వాతావరణంలో వ్యాపించిన రేడియోధార్మిక కణాలు ఆహార శ్రేణిలోకి చేరి తరతరాల పాటు జన్యు వ్యాధులను సృష్టించాయి. వైద్యపరమైన పరిశోధనల ప్రకారం అణు పరీక్షల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలలో కేన్సర్, ల్యూకేమియా, థైరాయిడ్ వ్యాధులు అధికంగా కనిపించాయి. కజాఖ్‌స్తాన్‌ లోని సెమిపాలటిన్స్‌క్ ప్రాంతం, పసిఫిక్ మహాసముద్రం లోని బికినీ అటోల్ దీవులు, నెవాడా ఎడారి లాంటి ప్రాంతాలు ఈ విషాదానికి సాక్ష్యాలుగా నిలిచాయి.

అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం నేడు మనిషి అనుభవించిన దుర్ఘటనల జ్ఞాపకమే కాక భవిష్యత్తు పట్ల మానవజాతికి ఒక హెచ్చరిక. ఈ రోజు దేశాలు పరస్పరం నమ్మకం పెంపొందించుకొని, ఆయుధ పోటీకి బదులుగా శాంతి సహకారం వైపు నడవాలని గుర్తు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ శాంతి సంస్థలు, శాస్త్రవేత్తలు, పౌర సమాజం అన్ని వర్గాలు ఈ రోజు నాడు అణు పరీక్షల ముప్పును సవివరంగా చర్చించి ప్రత్యామ్నాయ భద్రతా మార్గాలను అన్వేషిస్తాయి. అణు నిరాయుధీకరణ దిశగా వియన్నా, జెనీవా వంటి నగరాల్లో అనేక చర్చలు జరుగుతాయి. ఇది కేవలం ప్రభుత్వాలకే కాక సాధారణ పౌరులకూ శాంతి పట్ల బాధ్యతను గుర్తు చేసే రోజు.

అణు శక్తి శాంతి ప్రయోజనాల కోసం ఉపయోగపడే శక్తివంతమైన సాధనం కావచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వైద్యరంగం, వ్యవసాయం వంటి రంగాల్లో అది సద్వినియోగం అవుతుంది. కానీ దాన్ని ఆయుధాలుగా వినియోగించడం మానవ జాతికి అస్తిత్వపరమైన ముప్పు. అందుకే అంతర్జాతీయ సమాజం అణు నిరాయుధీకరణ పట్ల కట్టుబాటుగా ఉండి అణు పరీక్షలు జరపకుండా నిబద్ధతతో ముందుకు సాగాలి.

ఆగస్టు 29 మనకు చేసే బోధ ఇదే. భవిష్యత్తు తరాలకు ఒక సురక్షితమైన, శాంతియుతమైన ప్రపంచాన్ని అందించాలంటే అణు ఆయుధాల రహిత భూగోళాన్ని సాధించడానికి ప్రయత్నాలు ఆగ కూడదు. మానవ జీవన విలువను కాపాడటం, ప్రకృతి సమతుల్యతను పరిరక్షించడం, శాంతిని నిలబెట్టడం అనే మూడు లక్ష్యాల కోసం ఈ రోజు మానవ జాతి ఒకటిగా నిలబడి ఆత్మ పరిశీలన చేయాలి.

ఈ విధంగా అంతర్జాతీయ అణు పరీక్షల వ్యతిరేక దినోత్సవం చరిత్రను మాత్రమే కాదు, వర్తమానం, భవిష్యత్తును కూడా ఆలోచింపజేసే సందర్భం. ఇది కేవలం ఒక జ్ఞాపక దినం కాదు, మానవజాతి తన దారిని శాంతి, సహజీవనం వైపు మళ్లించుకోవాల్సిన సమయం అని గుర్తు చేసే అంతర్జాతీయ పిలుపు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News