- మెడికల్ బోర్డు ప్రక్రియ ఒక మొక్కుబడిగా చేసింది..
- తీవ్ర విమర్శలు చేసిన టి.ఆర్.ఎస్. అధినేత్రి కవిత..
కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెడికల్ బోర్డు ప్రక్రియను ఒక పెద్ద మొక్కుబడి డ్రామాగా మార్చేసి, అనారోగ్యంతో ఉన్న కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వైద్య పరీక్షల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రామా నడిపిందని కవిత ఆరోపించారు. దాదాపు 120 మంది కార్మికులను మెడికల్ బోర్డు ముందుకు రప్పించి, అందులో కేవలం 12 మందిని మాత్రమే ‘అన్‌ఫిట్’ అని తేల్చడం కాంగ్రెస్ ప్రభుత్వ దారుణమైన వైఖరికి, అన్యాయానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు.
అనారోగ్యంతో సతమతమవుతున్న కార్మిక కుటుంబాలకు ఊరటనిచ్చే ఉద్దేశం గానీ, వారికి భరోసానిచ్చే చిత్తశుద్ధి గానీ ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని అన్నారు. మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ అర్హులైన కార్మికుడిని తక్షణమే అన్‌ఫిట్‌గా గుర్తించాలని, వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని స్పష్టం చేశారు. కంటితుడుపు చర్యలతో కార్మికుల చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తే రాబోయే రోజుల్లో సింగరేణి బొగ్గు గని క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బాధితులైన ప్రతి సింగరేణి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు..
