Homeసాహిత్యంChildhood | తురాయిపూల కళ్ళు

Childhood | తురాయిపూల కళ్ళు

ఈ చెట్టు కిందే
మన బాల్యం గోలీలై
పరుగులు తీసేది
ఈ చెట్టుకిందే
మన కులాలు కడిగి కాలేసి
ఏక గళంగా పాటై పలికేవాళ్ళం
ఈ చెట్టుకిందే
ఊరు వాడా కలిసిపోయి
ఉదయ సాయింకాలాలు
ఒక్కటయ్యీవి
ఈ చెట్టుకిందే
మన బొంగరాలు తిరిగీ తిరిగీ
నేలకొరిగి బతుకంటే ఇంతేనని
బోద చేసేవి
ఇంతకీ ఈ చెట్టు ఏమయ్యింది
ఔను నాకెందుకు తెలీదు
రోడ్డుపామే మింగింది
ఈ చెట్టును ఆసరా చేసుకొని
బతికే పిట్టలు
వలసరాగమాలపిస్తూ
చెరో దిక్కుకు చేరువైనాయి
అభివృద్ధి భూతం
మన బతుకుల్ని తిమింగలంలా
మింగుతూ వుంది
అన్యాయం మీద అమాన్తం
విరుచుకుపడే తురాయిపూల కళ్ళు
నేడు కరువైనాయి.
అయినా
నా మనసులో విస్తరించిన
ఆ తురాయి చెట్టును
ఎవరూ కొట్టలేరు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News