ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు, సీపీఎం సీనియర్ నేత కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగానికి తీరని లోటు అని తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ఎండి గఫూర్ పాషా అన్నారు. మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, సీపీఎం సీనియర్ నాయకులు, ప్రముఖ రైతు ఉద్యమ నేత కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి (88) చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ఎండి గఫూర్ పాషా మాట్లాడుతూ…ఉమ్మడి వరంగల్ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో సారంపల్లి మల్లారెడ్డి ఒకరని తెలిపారు. సోమవారం హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడవడం యావత్ రైతాంగానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు.88 ఏళ్ల వయస్సులో కూడా భూమి హక్కు, సాగునీటి హక్కు, రుణమాఫీ, విత్తనాల కొరత, గిట్టుబాటు ధర వంటి అనేక రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు. ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులుగా, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులుగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మరణానికి సంతాపం తెలపడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు ఉదయం ఎంబీ భవన్ లో ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం వైద్య పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు.
ఈ నివాళుల కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ఆదినారాయణ, మండల కార్యదర్శి కంట్టెం సత్యం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కుమ్మరి శ్రీను, కార్యకర్తలు, నాయకులు జొన్నల నాగేశ్వరరావు, అంతటి కుమార్, బోట సాంబు, రాజు తదితరులు పాల్గొన్నారు.
