- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం విజయ్..
- ట్రాన్స్ జందార్లకు ఫ్రీ బస్సు సర్వీస్..
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం పలు కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే పథకంతో పాటు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.
‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పేరుతో గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి రానుంది. 2027 సంక్రాంతి నుంచి దీనిని ప్రారంభించనున్నారు. ఏటా రూ.2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
అర్హులైన కుటుంబాలు కొనుగోలు చేసే మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకానికి ఏటా సుమారు రూ.4,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులతో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కుటుంబాలపై అదనపు భారాన్ని మోపాయని విజయ్ తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం పరిధిని ప్రభుత్వం విస్తరించింది.
ఇకపై సాధారణ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లాల మధ్య నడిచే బస్సుల్లోనూ ఈ సదుపాయం కల్పించనున్నారు. ‘వెట్రి పయనం’ పేరుతో అక్టోబర్ 2 నుంచి ఈ విస్తరణ అమల్లోకి వస్తుంది. ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు విజయ్ ప్రకటించారు.
చెన్నై సమీపంలోని పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టుపై విజయ్ మరోసారి తన వ్యతిరేకతను స్పష్టం చేశారు. ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే కుటుంబాల పక్షాన నిలుస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుత మీనంబాక్కం, చెన్నై విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్-5 నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు.
