- రేపు(మంగళవారం)మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలి:
- రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వన మహోత్సవం కింద నిర్దేశించిన మొక్కల నాటే లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన మహోత్సవం కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు నాటిన మొక్కలు, ఇంకా నాటాల్సిన మొక్కలు, నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలు, జియో ట్యాగింగ్ తదితర అంశాలపై సమీక్షించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం అనుకూలమైన వర్షాలు కురుస్తున్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు(మంగళవారం) అన్ని జిల్లాల్లో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించి, వన మహోత్సవం లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఇతర అనువైన ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.


మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణ కంచె ఏర్పాటు చేయడంతో పాటు, తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, మంగళవారం చేపట్టనున్న వన మహోత్సవం మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు నిర్దేశించిన వన మహోత్సవం లక్ష్యంలో మిగిలిన మొక్కల నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని తెలిపారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని, జియో ట్యాగింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
