- సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కోచ్‌ల కరువు..
- క్రీడాకారుల భవిష్యత్తుతో చెలగాటం
- మూడు నెలలుగా క్రికెట్ కోచ్ లేడు..
- జిమ్నాస్టిక్స్,బాయ్స్ వాలీబాల్‌కు సైతం కోచ్‌లు కరువు
- స్టేడియం ముందు క్రీడాకారులు,పేరెంట్స్ బైఠాయింపు..
- క్రీడా శాఖ మంత్రి,కలెక్టర్,స్పోర్ట్స్ చైర్మన్,ఎండీకి ఫిర్యాదులు
- ఫిర్యాదులు చేసినా స్పందన కరువు..
- “కోచ్‌లు లేకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏమిటి?” అంటూ తల్లిదండ్రుల ఆగ్రహం
క్రీడాకారులను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు.. విశాలమైన స్టేడియం నిర్మించారు.. క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచారు.కానీ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాల్సిన కోచ్‌లను మాత్రం నియమించడం మరిచిపోయారా? అన్న ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద తీవ్రంగా వినిపిస్తోంది.
“అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని” అన్న చందంగా స్టేడియం పరిస్థితి తయారైందని క్రీడాకారులు,తల్లిదండ్రులు మండిపడుతున్నారు.నెలల తరబడి కోచ్‌లు లేకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియం ముందు బైఠాయించారు.తమ పిల్లల భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ అధికారులను నిలదీశారు.
మూడు నెలలుగా క్రికెట్‌కు ‘కోచ్’ కరువు!
క్రికెట్‌లో రాణించాలనే ఆశతో ప్రతిరోజూ స్టేడియానికి వచ్చే క్రీడాకారులకు గత మూడు నెలలుగా క్రికెట్ కోచ్ లేకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.శిక్షణకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం,బ్యాటింగ్–బౌలింగ్ మెళకువలు,ఫిట్‌నెస్,మ్యాచ్ ప్రిపరేషన్ వంటి అంశాల్లో నిపుణులైన కోచ్ సూచనలు లేకపోవడంతో క్రీడాకారులు నష్టపోతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“పిల్లలను ఇంతకాలం శిక్షణకు పంపుతున్నాం.. కానీ కోచ్ లేకపోతే వాళ్లు నేర్చుకునేది ఏమిటి? వారి ప్రతిభను ఎవరు తీర్చిదిద్దాలి?” అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
జిమ్నాస్టిక్స్.. బాయ్స్ వాలీబాల్‌దీ అదే కథ!
క్రికెట్ పరిస్థితి ఒక్కటే కాదని.. జిమ్నాస్టిక్స్,బాయ్స్ వాలీబాల్ విభాగాల్లోనూ కోచ్‌లు లేకపోవడం క్రీడాకారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని వారు తెలిపారు.క్రీడా రంగంలో చిన్న వయసులోనే సరైన కోచింగ్ అత్యంత కీలకమని.. నిపుణులైన కోచ్‌ల మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ప్రతిభ ఉన్న క్రీడాకారులు కూడా వెనుకబడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడిగితే.. అధికారుల నుంచి అదే నిర్లక్ష్యం!
కోచ్‌లను నియమించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా “చూద్దాం.. చేస్తాం” అంటూ కాలయాపన తప్ప పరిష్కారం కనిపించడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.క్రీడాకారుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యను కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.సమస్యను ఒక అధికారి నుంచి మరో అధికారికి బదిలీ చేస్తూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.
మంత్రికి.. కలెక్టర్‌కు.. చైర్మన్‌కు.. ఎండీకి ఫిర్యాదులు!
కోచ్‌ల కొరతపై ఇప్పటికే క్రీడా శాఖ మంత్రి, కలెక్టర్,స్పోర్ట్స్ చైర్మన్,ఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు క్రీడాకారులు,పేరెంట్స్ తెలిపారు.అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు స్టేడియం ఎదుట బైఠాయించాల్సి వచ్చిందన్నారు.ఇన్ని స్థాయిల్లో ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందని వారు పేర్కొన్నారు.
కోట్ల విలువైన సదుపాయాలు.. కోచ్‌లు మాత్రం ఎక్కడ?
స్టేడియంలో కోట్లాది రూపాయలతో సదుపాయాలు కల్పించినా వాటిని వినియోగించుకునేలా నిపుణులైన కోచ్‌లను అందుబాటులో ఉంచకపోతే ఆ వసతుల ప్రయోజనం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.
స్టేడియం ఉంది.. మైదానం ఉంది.. క్రీడా సామగ్రి ఉంది.. క్రీడాకారులు ఉన్నారు.. మరి కోచ్‌లు ఎందుకు లేరు? అంటూ అధికారులను నిలదీస్తున్నారు.క్రీడాకారుల భవిష్యత్తుకు ఎవరు బాధ్యత?
కోచ్‌ల కొరత కారణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలు కోల్పోతే అందుకు బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వ లక్ష్యం క్రీడలను ప్రోత్సహించడమే అయితే.. అందుకు అనుగుణంగా శిక్షణ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే కోచ్‌లను నియమించాలి
ఇప్పటికైనా ప్రభుత్వం,క్రీడా శాఖ ఉన్నతాధికారులు స్పందించి క్రికెట్,జిమ్నాస్టిక్స్,బాయ్స్ వాలీబాల్‌తో పాటు కోచ్‌ల కొరత ఉన్న అన్ని విభాగాల్లో వెంటనే అర్హులైన కోచ్‌లను నియమించాలని క్రీడాకారులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.క్రీడాకారుల ప్రతిభకు కోచ్‌ల కొరత అడ్డంకిగా మారుతుంటే.. కోట్లాది రూపాయలతో నిర్మించిన స్టేడియాలు ఎందుకు? అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
