- 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం లూటీ!
- రాత్రికి రాత్రే లారీల్లో అక్రమ తరలింపు
- సీసీ కెమెరాలున్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం
- సమాచారం చెప్పేందుకు, గుట్టు దాచేందుకు రాజకీయ నేతల వసూళ్ల పర్వం!
కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండే వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచే ఏకంగా 1100 బస్తాల ప్రభుత్వ ధాన్యం మాయమైంది. చండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. ఇందులో భాగంగా చండూరు శివారులోని ‘మహావీర్ రైస్ మిల్లు’కు భారీగా ధాన్యం కేటాయించారు. అయితే మిల్లులో స్థలాభావం కారణంగా, సివిల్ సప్లై అధికారుల అనుమతితో మూడు నెలల క్రితం మార్కెట్ యార్డులోని గోదాముల్లో ఈ ధాన్యాన్ని నిల్వ చేశారు. నెల రోజుల క్రితం గోదాం తెరిచి చూడగా కొన్ని బస్తాలు మాయమైనట్లు గుర్తించిన యజమాని.. వెంటనే మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్యకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, కొద్దిరోజుల తర్వాత మళ్లీ అదే గోదాం నుంచి మరింత ధాన్యం అపహరణకు గురైంది.

సీసీ ఫుటేజీలో లారీల గుట్టు..
గోదాం పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, రాత్రి వేళల్లో లారీల్లో ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగలు ఎవరన్నది స్పష్టంగా తెలియకపోవడంతో మిల్లు యజమాని స్థానికంగా ఆరా తీయడం మొదలుపెట్టారు.
రాజకీయ నేతల వసూళ్ల దందా..
ఈ వ్యవహారంలో కొందరు స్థానిక రాజకీయ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది. అందిన కాడికి దండుకునేందుకు నేతలు తెరవెనుక పావులు కదిపినట్లు స్పష్టమవుతోంది:
సమాచారానికి లక్షన్నర:
అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, రూ.1.50 లక్షలు ఇస్తేనే ఆ వివరాలు చెబుతామని కొందరు నేతలు మిల్లు యజమానిని డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం.
గుట్టు దాచేందుకు 5 లక్షలు:
రాత్రి వేళ ధాన్యం తరలిస్తున్న సమయంలో పసిగట్టిన మరికొందరు ప్రధాన పార్టీల నేతలు.. నేరుగా లారీలను అడ్డుకున్నారు. విషయం అధికారులకు చెప్పి కేసులు పెట్టిస్తామని బెదిరించి, అక్రమార్కుల వద్ద నుంచి ఏకంగా రూ.5 లక్షలు దండుకున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న అనుమానాలు..
సీసీ కెమెరాల నిఘా ఉన్న ప్రభుత్వ గోదాముల్లో ఇంత భారీ ఎత్తున లారీలకు లారీలు ధాన్యం మాయమవుతుంటే మార్కెట్ యార్డు సిబ్బంది, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. మిల్లు యజమాని నేరుగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడు స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరణ కోరేందుకు చండూరు ఎస్సై శివకుమార్ ను ఫోన్ లో సంప్రదించగా విచారణ చేస్తున్నామని తెలిపారు.
ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ ధాన్యం లూటీ వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి వెలుగులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
