- సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పార్టీల వేటు అప్రజాస్వామికం
- సంకుచిత రాజకీయాలతో యువతను అణచివేయలేరు
- క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న వారికి అండగా ఉంటాం
- ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ ధ్వజం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలపై రాజకీయ పార్టీలు కక్షసాధింపు చర్యలకు దిగడం అత్యంత అప్రజాస్వామికమని ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆపదలో ఉన్నవారికి సేవ చేసేవారిని ప్రోత్సహించాల్సింది పోయి, స్వార్థ రాజకీయాలతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఆయా పార్టీల సంకుచిత బుద్ధికి నిదర్శనమని విమర్శించారు.
తమ ఫౌండేషన్ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇందులో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లతో అణచివేతకు గురయ్యే ప్రతి ఒక్కరికీ ఫౌండేషన్ పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. యువతలో సేవా స్ఫూర్తిని అడ్డుకోవాలని చూస్తే ఎంతటివారైనా సహించేది లేదని, రాబోయే రోజుల్లో యువత ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెబుతుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
