HomeజాతీయంBJP MP K Laxman | కాంగ్రెస్ సర్కారుది పచ్చి భూదోపిడీ

BJP MP K Laxman | కాంగ్రెస్ సర్కారుది పచ్చి భూదోపిడీ

  • ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్
  • 22ఏ జాబితా పేరిట సామాన్యుల ఆస్తుల లూటీ
  • కమీషన్ల కోసం ప్రజలు, బిల్డర్ల బ్లాక్‌మెయిల్
  • వేల కోట్ల స్కామ్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ ముసుగులో 22ఏ నిషేధిత భూముల జాబితా పేరిట పచ్చి దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెవెన్యూ శాఖ బ్రోకర్‌ దందా చేస్తూ సామాన్యుల ఆస్తులను లూటీ చేస్తోందని ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లే 22ఏ జాబితాలో చేరడం, దీనిపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పడం, రాత్రికి రాత్రే ప్రైవేటు భూములను మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని మరో మంత్రి కోమటిరెడ్డి బాహాటంగా ఒప్పుకోవడమే ఈ ప్రభుత్వ స్కామ్‌కు నిదర్శనమన్నారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా అనుమతులు ఉండి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన ఆస్తులను సైతం అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో చేరుస్తూ సెటిల్‌మెంట్లకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. 22ఏ నుంచి పేర్లు తీయడానికి 30 నుంచి 40 శాతం కమీషన్లు డిమాండ్‌ చేస్తూ బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల తీరు వల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిని రియల్ ఎస్టేట్‌ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు సామాన్యుల ఆస్తులనే బంగాళాఖాతంలో ముంచుతున్నారని లక్ష్మణ్‌ ఆక్షేపించారు.

- Advertisement -

ఆర్టికల్‌ 300A ప్రకారం రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 22ఏ జాబితా నుంచి ఎన్ని వేల ఎకరాలు తొలగించారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పక్షాన గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News