- కడ్తాల్‌లో విస్తృత తనిఖీలు..
- కిరాణా,పాన్ షాపులు,ధాబాలు,హోటళ్లపై నిఘా
- పలు కాలనీల్లో డ్రగ్స్‌పై అవగాహన..
- విద్యార్థులు,యువతకు మత్తు పదార్థాలపై చైతన్యం
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, అనుమతులు లేని ప్రదేశాల్లో మద్యం సేవనం, మత్తు పదార్థాల వినియోగం,విక్రయాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’లో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది.ముఖ్యంగా ఆగస్టు 2న గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులు,ధాబాలు,హోటళ్లు,పాన్ షాపుల వద్ద జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.కథనం వెలువడిన అనంతరం ఆమనగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బధ్యనాథ్ చౌహాన్ తెలిపారు.
ఇందులో భాగంగా కడ్తాల్ మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు,పాన్ షాపులు,ధాబాలు,హోటళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం నిల్వ చేస్తున్నారా? అనుమతులు లేకుండా విక్రయాలు సాగుతున్నాయా? నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు.నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులు,నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


డ్రగ్స్‌పై ప్రత్యేక అవగాహన
అక్రమ మద్యం నియంత్రణతో పాటు మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండేలా కడ్తాల్ పట్టణంలోని పలు కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీఐ బధ్యనాథ్ చౌహాన్ తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు,యువతకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు,ఆరోగ్యంపై పడే ప్రభావం,కుటుంబాలు–సమాజంపై కలిగే దుష్ప్రభావాలపై చైతన్యం కల్పిస్తున్నారు.యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం,విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.

అక్రమ మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు
అనుమతులు లేకుండా మద్యం విక్రయించడం,అక్రమంగా మద్యం నిల్వ చేయడం,ధాబాలు,హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అందించడం వంటి చర్యలకు పాల్పడితే ఎక్సైజ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు.అక్రమ మద్యం,సారా,డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల తయారీ,రవాణా,విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని కోరారు.


ఆగస్టు 2న ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనం
ఆమనగల్ ఎక్సైజ్ పరిధిలో కడ్తాల్ మండలంలో బెల్ట్ షాపులు,ధాబాలు,హోటళ్లలో అక్రమ మద్యం విక్రయాలు,పాన్ షాపుల వద్ద మత్తు పదార్థాల వినియోగంపై ఆగస్టు 2న ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది.ఈ తనిఖీలు,అవగాహన కార్యక్రమాల్లో ఎస్‌ఐలు అరుణ్‌కుమార్,శివప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య,ఎక్సైజ్ సిబ్బంది రామ్‌రెడ్డి,శ్రీను,లత,సాయి శ్రీజ తదితరులు పాల్గొన్నారు. “అక్రమ మద్యం,మత్తు పదార్థాల విషయంలో రాజీ లేదు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
