- ఆర్ధిక ఇబ్బందులే కారణం..
- నిజామాబాద్ జిల్లాలో ఘటన..
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహ*త్యకు పాల్పడిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇంటి కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఒత్తిడికి గురైన దంపతులు బలవన్మరణానికి పాల్పడింది. భర్త బెడ్‌రూంలో ఉరివేసుకోగా.. భార్య మరో గదిలో విషం తాగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా మొండోరా మండలం నాగంపేటకు చెందిన శేషాల నరేశ్ (35)కు నిజామాబాద్ జిల్లా కోటగల్లికి చెందిన మేఘన (30)తో 2014లో వివాహమైంది. వీరికి అయాన్ష్ (9), మిథున్ (7) ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మరణించడంతో నరేశ్‌కు విద్యుత్ శాఖలో ఐదేళ్ల కిందట అటెండర్ ఉద్యోగం వచ్చింది. ఆరు నెలల కిందట జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఈఆర్‌వో కార్యాలయంలో పనిచేస్తూ వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నరేశ్ గతేడాది సుమారు రూ.90లక్షల అప్పు చేసి, సొంతిల్లు కొనుగోలు చేశాడు.
ఆ ఇంటిపై బ్యాంక్ లోన్ తీసుకుని.. బయట తీసుకున్న అప్పులు చెల్లించాలని అనుకున్నాడు. కానీ బ్యాంకులో లోన్ దొరకలేదు. బయట బాకీల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దీంతో కొద్దిరోజుల కింద ఇల్లు అమ్మి, వచ్చిన డబ్బులతో కొంతమేర బాకీలు తీర్చాడు. అయినప్పటికీ పెద్ద మొత్తంలో అప్పు అలాగే ఉండటంతో నరేశ్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో అతనికి కుటుంబసభ్యులు చికిత్స కూడా చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన అనంతరం నరేశ్, మేఘన ఇంట్లోనే ఆత్మహ*త్యకు పాల్పడ్డారు. నరేశ్ బెడ్‌రూంలో ఉరివేసుకుని ఆత్మహ*త్య చేసుకోగా.. భార్య మేఘన మరో గదిలో విషయం తాగి బలవన్మరణానికి పాల్పడింది.
అంతకుముందు ఉదయం 10.30 గంటల సమయంలో మేఘన తల్లి లావణ్య ఫోన్ చేయగా.. కుమార్తె సరిగ్గా మాట్లాడలేదు. పిల్లల గురించి అడిగితే వేరే ఇంటికి పంపించానని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి గంటన్న తర్వాత భర్త, బంధువులతో కలిసి కుమార్తె ఇంటికి వెళ్లింది.అక్కడ గది తలుపులు ఎంత కొట్టినా తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోపలికి వెళ్లి చూడగా నరేశ్, మేఘన అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు.
