- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి పిలుపు..
రైతులు,కార్మికులు,వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం,సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, కార్మికులు,సామాన్య ప్రజల హక్కులు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు.
రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 14 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసి 736 మంది ప్రాణత్యాగాల అనంతరం ఆ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు.ఇప్పుడు అదే చట్టాలను పరోక్షంగా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.అలాగే కార్మికులు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరిచారని విమర్శించారు.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని,మరో వైపు పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులు, కార్మికులు,వ్యవసాయ కూలీలు,విద్యార్థులు,యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో వందలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు శాఘంరెడ్డి జగన్మోహన్ రెడ్డి,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు భూక్య పాండు నాయక్, సిపిఎం మండల కార్యదర్శి మాలోత్ బాలు నాయక్,సిమెంట్ క్లస్టర్ కన్వీనర్ వట్టేపు సైదులు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పోసనబోయిన హుస్సేన్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను,ప్రజా సంఘాల నాయకులు కోటేశ్వరి,కే. వెంకట్ రెడ్డి,ఎస్.కే. సైదులు, భద్రారెడ్డి,పోడిశెట్టి రాము,వినోద్ నాయక్,ఎం. లక్ష్మణ్ రెడ్డి,చర్ల బాబు,కంటు కోటయ్య, పూల నాగరాజు,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
