Homeభక్తిJagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర..

Jagannath Rath Yatra | అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర..

  • ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరించిన పవిత్ర కార్యం..

విశ్వ విఖ్యాతమైన జగన్నాథుని రథయాత్ర సందడి మొదలైంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి శ్రీక్షేత్రంపైనే కేంద్రీకృతమై ఉంది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా సాగుతుంది. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాలలోను జగన్నాథ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. జులై 16, గురువారం జరగనున్న జగన్నాథుని రథయాత్ర గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. జగన్నాథుడు శ్రీకృష్ణుని స్వరూపం. జగన్నాథుడైన శ్రీకృష్ణుడు తన సోదరుడైన బలభద్రుడు అంటే బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి ఒకే పీఠంపై పూజలందుకునే విశిష్ట క్షేత్రం పూరీ! ఇలా అన్నాచెల్లెళ్లను ఒకేచోట కొలిచే క్షేత్రం దేశంలో మరోటి లేదు.

బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాలలో జగన్నాథ రథయాత్ర గురించ్జి వివరించి ఉంది. ఈ పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం ఆచరించాడని, దాంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దారువు అంటే కొయ్య దుంగగా సముద్ర జలాల్లో తేలియాడుతూ వచ్చాడని పురాణ కథనం. బ్రహ్మదేవుని ఆజ్ఞతో విశ్వకర్మ ఆ దుంగను మూడు మూర్తులుగా మలచాడని అంటారు. బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపు రంగులో ఉండగా, జగన్నాథుడు మాత్రం నీలి మేఘ చాయలో భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. అందుకే ఇక్కడ జగన్నాథునికి నీలమాధవుడని పేరు. ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోనే యజ్ఞానంతరం ఈ మూర్తులను ప్రతిష్టించారని అంటారు. ఆ యజ్ఞవాటికనే ప్రస్తుతం మనం దర్శిస్తున్న గుండిచా మందిరం.

- Advertisement -

జగన్నాథుని రథయాత్రలో జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రకు ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక రథం ఉంటుంది. ఈ ఉత్సవం కోసం ప్రతి ఏడాది ప్రత్యేకంగా తయారు చేసే దారు రథాలు జ్యేష్ఠ అమావాస్యకల్లా సిద్ధమవుతాయి. ఇవన్నీ కూడా చెక్కతో తయారుచేసినవే కావడం విశేషం. పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు.

రథయాత్రలో భాగంగా గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలభద్రుడు, పద్మ ద్వజ రథంలో సుభద్ర శ్రీ క్షేత్రం నుంచి బయలుదేరి గుండిచాకు చేరుకుంటారు. ఈ మూడు రథాల్లో జగన్నాథుడు కొలువై ఉండే రథం అన్నింటి కంటే ఎత్తయినది. ఈ మూడు రథాలకు అలంకరించే వస్త్రాలు మొదలుకొని, రథాల పీఠాలు, స్తంభాలు, కొయ్యగుర్రాలు అన్ని వేటికవే ప్రత్యేకమైనవి.

సాధారణంగా ఊరేగింపుల్లో ఉత్సవ విగ్రహాలు పాల్గొనడం ఆనవాయితీ! కానీ జగన్నాథుని రథయాత్రలో గర్భాలయంలో ఉన్న మూల విరాట్టులు రథయాత్రలో పాల్గొనడం విశేషం. అందుకే ఈ రథయాత్రకు అంతటి పవిత్రత, అంతటి విశిష్టత! సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News