- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ (ఆల్బెండజోల్) మాత్రలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.


ఆల్బెండజోల్ మాత్రల వల్ల నులిపురుగులు నశించి, రక్తహీనత రాకుండా ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం విధిగా మాత్రలను తీసుకోవాలని అన్నారు. విద్యార్థులంతా ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. అనారోగ్యానికి గురికాకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, ఇమ్యూనైజేషన్ అధికారి నయనా రెడ్డి, అధికారులు రవీందర్, ప్రిన్సిపల్స్ డానియల్, తదితరులు పాల్గొన్నారు.

