- రజత పథకం సాధించిన మహిళల టీమ్..
- యువ క్రీడాకారులకు స్ఫూర్తి అన్న సీఎం..
మాడ్రిడ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. జట్టు సభ్యులైన జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్, చికిత తానిపర్తిలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ బిడ్డ జ్యోతి సురేఖ వెన్నం అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తుండటం మాకు గర్వకారణం. ఆమె మన రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘ఎపెక్స్ 2036’ ద్వారా జ్యోతి సురేఖ వంటి మరెందరో ఛాంపియన్లను తీర్చిదిద్దుతాం. భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలి” అని ఆకాంక్షించారు.
రాష్ట్ర క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా భారత మహిళల ఆర్చరీ జట్టును అభినందించారు. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరడం గొప్ప విజయమని, రజత పతకం గెలవడం భారత ఆర్చరీ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి లార్డ్స్ ఆనర్స్ బోర్డ్‌పై స్థానం సంపాదించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచిన క్రాంతి గౌడ్‌ను అభినందించారు. ఆమె అద్భుత ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
