బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్ష నేతగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్న కే.ఆర్.సురేష్ రెడ్డి పదవీ విరమణ చేయడంతో, ఆ స్థానంలో ప్రస్తుతం ఉపనేతగా ఉన్న రవిచంద్రకు కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారు. బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర సేవలను గుర్తించి పార్టీ ఆయనను వరుసగా రెండోసారి రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2030 ఏప్రిల్ వరకు ఉంటుంది.
కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల వాణిని పార్లమెంటులో బలంగా వినిపిస్తానని, పార్టీ బలోపేతానికి మరియు కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
