Sunday, June 28, 2026
Homeక్రైమ్ వార్తలుFraud | అదుపులోకి గోల్డ్ మ్యాన్..

Fraud | అదుపులోకి గోల్డ్ మ్యాన్..

  • పల్లపు సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..
  • తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని పలువురిని మోసం..

కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ ‘గోల్డ్ మ్యాన్’గా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్‌ను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి నాణ్యమైన బంగారాన్ని తెచ్చి మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తానని నమ్మబలికిన సురేష్ కుమార్.. హిమాయత్ నగర్, నిలోఫర్‌కు చెందిన పలువురి నుంచి దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేశారు.

దీంతో సెటిల్‌మెంట్ కింద కొందరికి రూ. 10 లక్షల విలువైన మూడు ఐఫోన్లు, రూ. 20 లక్షల చెక్కు ఇచ్చిన సూర్యాభాయ్.. ఆ తర్వాత మాట మార్చాడు. బాధితులే తనను బెదిరించి ఫోన్లు దొంగిలించారంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో సూర్యాభాయ్ చేసిన మోసం వెలుగుచూసింది. దీంతో ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదైందని తెలుసుకుని హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన సూర్యాభాయ్‌ను పోలీసులు షాద్‌నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

భారీ బంగారు చైన్లు, గాజులు వేసుకుంటూ సోషల్ మీడియాలో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ సెలబ్రిటీలా తిరగడం సూర్యాభాయ్‌కు అలవాటు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడి లైఫ్‌స్టైల్‌పై నిఘా పెట్టడంతో అతడు ధరించే నగల్లో చాలా వరకు రోల్డ్ గోల్డ్ (గిల్ట్ నగలు) అని తేలింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News