Wednesday, June 24, 2026
Homeనల్లగొండFarmers | యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి

Farmers | యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి

  • తెలంగాణ రైతు సంఘం
  • ఎరువుల ధరలు, నకిలీ విత్తనాలను అరికట్టాలని తహసీల్దార్‌కు వినతి

మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్యల ఆధ్వర్యంలో నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

యాప్‌తో అన్నదాతల అవస్థలు

కొత్తగా తీసుకొచ్చిన ‘యూరియా యాప్’ విధానంతో నిరక్షరాస్యులైన రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని, కాబట్టి ఆ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. మార్కెట్లో నకిలీ విత్తనాల బెడదను అరికట్టి, నాణ్యమైన విత్తనాలను మండల కేంద్రాల్లోనే రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. దానికితోడు అమాంతం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే తగ్గించి రైతులను ఆదుకోవాలన్నారు.

- Advertisement -

అందరికీ రైతుభరోసా.. కొత్త పంట రుణాలు

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ ‘రైతు భరోసా’ కల్పించాలని, ఆ నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. నాబార్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనల ప్రకారం రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణమాఫీని వెంటనే పూర్తిచేసి, రైతులకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. సకాలంలో రుణాలు అందకపోతే అన్నదాతలు పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు ఏరుకొండ రాఘవేంద్ర, సల్వోజు రామలింగచారి, ఏరుకొండ శ్రీశైలం, ఏరుకొండ శంకర్, పగిళ్ల గిరి, మల్లయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News