Monday, June 8, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంBadi Bata | బడిబాట జోరు.. బడుల పరిస్థితి బేజారు!

Badi Bata | బడిబాట జోరు.. బడుల పరిస్థితి బేజారు!

  • కాగితాల్లో చేరికలు.. క్లాస్ రూముల్లో ఖాళీలు!
  • రూపాయి ఖర్చు ‘ప్రచారానికే’.. రూపం మారని ‘సర్కారు బడి’!
  • పిల్లలను పిలుస్తున్నారు సరే.. సౌకర్యాలు ఇస్తున్నారా?
  • సార్ల వేట ముగిసింది.. ఇక చదువుల సంగతేంటి?
  • లక్ష్యాలు దాటుతున్న ‘బడిబాట’..
  • చేరికల పండుగ వెనుక.. చేదు నిజాలు!
  • ఒట్టి ‘మాటల’ బాట.. ఒరిగిందేమిటి?
  • ప్రచారానికి ఉన్న శ్రద్ధ.. పర్యవేక్షణపై ఏది?

మరో విద్యా సంవత్సరం (2026-27) వచ్చేసింది. ఎప్పటిలాగే విద్యాశాఖ అధికారులు రంగురంగుల పోస్టర్లు, డప్పు చప్పుళ్లతో “బడిబాట” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలి, నాణ్యమైన విద్యను అందించాలి” అనే ఆశయం కాగితం మీద వినడానికి చాలా బాగుంది.

కానీ, క్షేత్రస్థాయిలో సర్కారు బడుల దుస్థితిని చూస్తే సామాన్యుడి నోట వస్తున్న ఒకే ఒక్క మాట.. “నమ్మకం లేదు దొరా!” రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు ఇవ్వాలంటే ‘జీవో ఎంఎస్ నంబర్ 1’ నిబంధనలను అధికారులు భూతద్దం పెట్టి మరీ వెతుకుతారు. ఆటస్థలం ఉందా? సొంత భవనమా? ఫైర్ సేఫ్టీ ఉందా? క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉన్నాయా? అంటూ రూల్స్ మాట్లాడుతారు. మరి ఇదే జీవో, ఇవే నిబంధనలు ప్రభుత్వ పాఠశాలలకు వర్తిం చవా? అని సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు పాలకుల దగ్గర సమాధానం లేదు.
ఒకే గదిలో ఐదు తరగతులు.. చెట్ల కింద ‘డిజిటల’ విద్య! : ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగానేటికీ వేలాది సర్కారు బడులు కొట్టుమిట్టాడు తున్నాయి.

- Advertisement -

కనీస వసతులు శూన్యం : ఎన్నో గ్రామాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలందరినీ ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. ఒకే నల్లబల్లపై ముగ్గురు నలుగురు ఉపాధ్యాయులు పోటీపడి వేర్వేరు పాఠాలు చెబుతున్న దౌర్భాగ్యం నేటికీ కొనసాగుతోంది. బల్లలు లేవు… కూర్చోవడానికి చోటు లేదు : ఐటీ హబ్‌లు, డిజిటల్ విప్లవం గురించి లెక్చర్లు ఇచ్చే పాలకులు.. పిల్లలు కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. నేటికీ వేలాది మంది విద్యార్థులు చలికి, ఎండకు క్లాస్ రూముల్లో నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది.

చేతులు చాచిన భవనాలు.. చెట్ల కిందే పాఠాలు : వర్షం వస్తే కురిసే భవనాలు, పైకప్పు పెచ్చులు ఊడిపడే గదులు భయపెడుతుండటంతో… ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. మరి వీరికి ‘నాణ్యమైన విద్య’ ఎలా అందుతుంది?

లెక్కల బడాయి.. క్షేత్రస్థాయిలో లొసుగులు : “మేము ఒక్కొక్క విద్యార్థిపై ఏడాదికి సగటున రూ. 1,20,000 ఖర్చు పెడుతున్నాం” అని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుంది.

నిలదీస్తున్న సామాన్యుడు : బడుల్లో తాగడానికి స్వచ్ఛమైన నీరుండదు, బాలికలకు సరైన మరుగుదొడ్లు ఉండవు, వర్షం వస్తే క్లాస్ రూమ్ అంతా జలమయం అవుతుంది.. మరి ఈ లక్షా ఇరవై వేల రూపాయల బడ్జెట్ ఎటు పోతోంది? కేవలం జీతాలకేనా? మౌలిక వసతుల కల్పనలో ఎందుకు విఫలమవుతున్నారు?

పాలకులారా.. మీ పిల్లలను చేర్పించే దమ్ముందా? : బడిబాట కార్యక్రమం నిజంగా విజయవంతం కావాలన్నా, ప్రజల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం కలగాలన్నా పాలకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి.

నాయకుల ద్వంద్వ నీతి : ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తమ పిల్లలను, మనవళ్లను ఏ కార్పొరేట్ స్కూళ్లలోనో, ఇంటర్నేషనల్ స్కూళ్లలోనో చదివిస్తూ… సామాన్యుడిని మాత్రం సర్కారు బడికి పొమ్మనడం ముమ్మాటికీ ద్వంద్వ నీతి.

నిజమైన మార్పు అక్కడే : మొదట ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలవాలి. అప్పుడు బడుల పరిస్థితి రాత్రికి రాత్రే మారుతుంది. ఎందుకంటే తమ పిల్లలు చదివే బడి బాగుండాలని ఏ నాయకుడైనా నిధులు త్వరగా మంజూరు చేయిస్తాడు.

కేవలం విద్యా సంవత్సరం ప్రారంభంలో హడావుడి చేసి, చేతులు దులుపుకునే “బడిబాట” ప్రహసనాలకు ఇకనైనా స్వస్తి పలకాలి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మౌలిక వసతులు, ఆధునిక ల్యాబ్‌లు కల్పించినప్పుడే ప్రభుత్వ బడులకు పూర్వవైభవం వస్తుంది. అప్పటివరకు ఎన్ని బడిబాటలు నిర్వహించినా, అది కేవలం అధికారుల రికార్డుల కోసమే తప్ప… విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదనేది అక్షర సత్యం! పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆశిద్దాం.

(ప్రేమ్ సాగర్, ప్రత్యేక ప్రతినిథి)

- Advertisement -
RELATED ARTICLES

Latest News