Friday, June 5, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAlert | ఆలస్యపు వివాహాలు… భావితరాలపై నీలినీడలు..

Alert | ఆలస్యపు వివాహాలు… భావితరాలపై నీలినీడలు..

  • 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి ఊసు ఎత్తని యువత..
  • కొందరికి పెళ్లిమీద విపరీతమైన అనాసక్తి..
  • జీవశాస్త్రపరంగా తీవ్రమైన ప్రభావం..
  • లేటు వయసులో పిల్లలు కలిగితే తల్లికి ప్రమాదం..
  • శుక్రకణాల శక్తి తగ్గిపోవడం జరుగుతుంది..
  • బుద్ధిమాంద్యం గల పిల్లలు కలగడం సంభవిస్తోంది..
  • ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పునరావాస కేంద్రాలు..
  • లక్షల్లో బుద్ధిమాంద్యం గల పిల్లలు, ఇది ఆందోళన కలిగిచే విషయం.
  • భవిష్యత్తులో జనాభా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం..
  • దీనిపై యువతలో అవగాహన కల్పించాలంటున్న నిపుణులు..

పెళ్లంటే నూరేళ్లపంట.. భారతదేశంలో వివాహవ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది.. కేవలం రెండు జీవితాలు కలవడమే కాదు.. మరిన్ని జావితాలకు వెలుగునిచ్చే అపురూప కార్యక్రమం వివాహం.. ఒకప్పుడు సరైన సమయంలో వివాహం జరిపించేవారు.. ఆ సమయంలో పెళ్లి జరగడం మూలాన ఆరోగ్యకరమైన, మేధస్సుతో కూడిన పిల్లలు జన్మించేవారు.. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా, సమృద్ధిగా ఉండేది.. కానీ ఇప్పుడు లేటు వయసులో వివాహాలు జరుగుతున్నాయి.. కారణాలు అనేకానేకం.. దీనితో బలహీనమైన, బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు జన్మిస్తున్నారు..

కేవలం శరీరం పెరుగుతోంది తప్ప.. వారిలో మెదడు పెరగడం లేదు.. దీంతో భవిష్యత్ యువత నిర్వీర్యం అయిపోతోంది.. మన దేశంలో ఇలాంటి బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల కోసం పునరావాస కేంద్రాలు వెలసాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.. లక్షల్లో బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలున్నారని అంచనా.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెళ్లి, సంతానం అని బుక్స్ లో మాత్రమే చదువుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంటుంది.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు హెచ్చరిస్తూ సూచిస్తున్నారు..

- Advertisement -

ఒకప్పుడు భారతీయ సమాజంలో 18 ఏళ్లకు అమ్మాయికి, 21 ఏళ్లకు అబ్బాయికి వివాహం జరిపించడం ఆనవాయితీగా ఉండేది. శారీరకంగా, మానసికంగా ఎంతో చురుగ్గా ఉండే ఆ వయసులో పెళ్లి జరగడం వల్ల ఆరోగ్యకరమైన సంతానం కలిగేది. తల్లిదండ్రులకు 35-40 ఏళ్లు వచ్చేసరికి పిల్లలు చేతికందొచ్చేవారు.. దీనివల్ల కుటుంబ బాధ్యతలు త్వరగా తీరిపోయి, జీవితం ఎంతో సంతోషంగా సాగేది. కానీ, నేటి ఆధునిక కాలంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కెరీర్ సెటిల్‌మెంట్, ఆర్థిక స్థిరత్వం, ఉన్నత చదువుల పేరుతో యువతీ యువకులు పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు.

నేడు 30 నుండి 35 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తని యువత సంఖ్య పెరుగుతోంది. మరికొందరైతే పెళ్లి పట్ల పూర్తి అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ధోరణి వ్యక్తిగతంగా బాగున్నట్లు అనిపించినా, జీవశాస్త్రపరంగా తీవ్రమైన ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య శాస్త్రం ప్రకారం.. స్త్రీ, పురుషులలో వయసు పెరిగే కొద్దీ వారిలోని అండాలు, శుక్రకణాల నాణ్యత తగ్గుతుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

డౌన్స్ సిండ్రోమ్ : లేటు వయసులో పిల్లలు కలగడం వల్ల వారిలో క్రోమోజోముల లోపాల కారణంగా బుద్ధిమాంద్యం, శారీరక ఎదుగుదల లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆటిజం : నేటి ఆధునిక కాలంలో పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ రేటు పెరగడానికి తల్లిదండ్రుల వయసు కూడా ఒక ముఖ్య కారణమని పరిశోధనలు చెబుతున్నాయి.

శరీరం పెరుగుతోంది.. మెదడు పెరగడం లేదు :

శరీరం వయసుకు తగ్గట్టుగా పెరుగుతున్నప్పటికీ, మానసిక పరిణతి మాత్రం ఐదేళ్ల పిల్లాడి స్థాయిలోనే ఉండిపోవడం నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.

భవిష్యత్తుకు ముప్పు :
వృద్ధుల దేశంగా మారే ప్రమాదం..!

యువత పెళ్లిళ్లకు దూరం కావడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి రేటు దేశవ్యాప్తంగా పడిపోతోంది. ఇదే ధోరణి కొనసాగితే, భవిష్యత్తులో దేశంలో యువశక్తి తగ్గిపోయి, వృద్ధుల జనాభా పెరిగిపోయే ప్రమాదం ఉందని జనాభా నియంత్రణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నెన్నో సంఘటనల్లో తమ జీవితాలను అర్ధాతరంగా ముగించిన కుటుంబాలు కూడా ఉన్నాయి.. జన్యు లోపాలతో, బుద్ధి మాంద్యం కలిగిన పిల్లలు కళ్ళముందు నరకం అనుభవిస్తుంటే చూడలేక.. సమాజం చేస్తున్న గేలిని భరించలేక పిల్లతో పాటు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అనేకానేకం చూస్తున్నాం..

ఇలాంటి దుర్భర పరిస్థితులు సామాన్యుల ఇండ్లలోనే కాకుండా ప్రముఖల ఇండ్లలోనూ కనిపిస్తున్నాయి.. రాజకీయ వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుటుంబాలు.. దీనికి కారణం అవగాహనా లోపం.. అలసత్వం.. వివాహం అనే పదాన్ని అసహ్యించుకోవడం.. అందుకే పెద్దలు అంటుంటారు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని.. దీనిపై మేధావులు, వైద్య నిపుణులు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.. సరైన సమయంలో వివాహం చేసుకోవాలనే ఒక చట్టం తీసుకుని వస్తే బావుంటుంది అన్నది మేధావులు సూచిస్తున్నారు.. దీనివల్ల భవిష్యత్ జనాభా బలంగా ఉండటమే కాకుండా.. ఒక శక్తివంతమైన, మేధస్సుతో కూడిన సమ సమాజం ఏర్పడుతుంది..

వాస్తవాలను గ్రహించండి :

ఒక అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో ఆరేళ్ల పసిపాప నవ్వుతుంటే ఇల్లంతా వెలుగు నిండినట్లు ఉంటుంది. కానీ, ఆ నవ్వు వెనుక ఒక తీరని వేదన ఉంది. సమయానికి మాటలు రాకపోవడం, వయసుకు తగ్గట్టుగా పనులు చేసుకోలేకపోవడం, తోటి పిల్లలతో కలవలేకపోవడం చూసి తల్లి దండ్రులు ఎన్నో రాత్రులు కన్నీరు కారుస్తుంటారు.. “మన పాపకి ఏమైంది? మనకే ఎందుకు ఈ కష్టం వచ్చింది?” అని ఓ తల్లి రోజూ దేవుడి ముందు ఏడ్చేది. గ్రామంలో కొందరు “ఇది పూర్వజన్మ పాపం” అని ఈసడించుకుంటే, మరికొందరు “గ్రహాల దోషం” అంటూ లేనిపోని నమ్మకాలు నూరిపోశారు.కానీ ఎవరో చెప్పిన మాటలు విని లాభం లేదని భావించిన ఆ పాప తల్లిదండ్రులు పాపను తీసుకుని హైదరాబాద్‌లోని ప్రముఖ చిన్నపిల్లల ఆసుపత్రికి వచ్చారు..

అక్కడ వైద్యులు పాపను పరీక్షించి, అది ఏ పాపమో, శాపమో కాదని… అదొక మానసిక, శారీరక ఎదుగుదల లోప మని (బుద్ధి మాంద్యం) తేల్చి చెప్పారు. ఇది ఒకరి కథ కాదు.. కొన్నివేల కుటుంబాల్లో ఇలాగే జరుగుతుతోంది.. అసలు ఎందు కు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి..? దీని వెనుక ఒక భయం కరమైన వాస్తవం దాగుంది.. వినడానికి వింతగా అనిపించినా ఇది వాస్తవం.. పిల్లల్లో బుద్ధి మాంద్యం కలగడానికి గల శాస్త్రీ య కారణాలను నాలుగు దశలుగా వివరించారు వైద్యులు..

జన్యుపరమైన లోపాలు :

గర్భంలో పిండం పెరిగేటప్పుడు క్రోమోజోముల సంఖ్యలో మార్పులు రావడం, వంశపారంపర్యంగా వచ్చే ‘ఫ్రజైల్ ఎక్స్ సిండ్రోమ’, లేదా శరీరంలో ప్రోటీన్లు జీర్ణం కాక మెదడు దెబ్బతినే ‘ఫినైల్ కీటోనూరియా’ వంటి జీవక్రియ లోపాలు. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా, సైటోమెగాలోవైరస్ వంటి ఇన్ఫెక్షన్లు సోకడం, పోషకాహార లోపం (ఫోలిక్ యాసిడ్ లోపం), లేదా విపరీతమైన రక్తపోటు వల్ల శిశువుకు రక్తప్రసరణ తగ్గడం. కాన్పు ఆలస్యమవడం వల్ల లేదా ఉమ్మనీరు తాగడం వల్ల శిశువు మెదడుకు కొన్ని సెకన్ల పాటు ఆక్సిజన్ అందకపోవడం, లేదా నెలలు నిండకుండానే పుట్టడం.

చిన్నతనంలో మెదడు వాపు వ్యాధి, తట్టు రావడం, ప్రమాదవశాత్తూ తలకు తీవ్రమైన గాయాలు కావడం, లేదా శ్వాస-ఆహారం ద్వారా సీసం, పాదరసం వంటి విషపూరిత రసాయనాలు శరీరంలోకి చేరడం.దేశవ్యాప్తంగా దాదాపు 2శాతం మంది పిల్లలు ఇలాంటి సమస్యలతోనే జన్మిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన పరిశోధనల ప్రకారం 2 నుండి 6 ఏళ్ల పిల్లల్లో 9.6శాతం మంది, 6 నుండి 9 ఏళ్ల పిల్లల్లో 14.4మంది మంది ఏదో ఒక న్యూరోడెవలప్‌మెంటల్ లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి పిల్లలకు ఇప్పుడు కావాల్సింది కేవలం మందులు కాదు, నిరంతర శిక్షణ అంటే థెరపీ. కాగా తెలంగాణలో ఇలాంటి పిల్లల కోసం 60కి పైగా గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థలు వున్నాయి..

స్వీకార్ ఉపకార్ (సికింద్రాబాద్): ఆటిజం, బుద్ధి మాంద్యం ఉన్న పిల్లల కోసం హైదరాబాద్ స్పెషల్ స్కూల్ పేరుతో సేవలందిస్తోంది.

  • సాధన స్పెషల్ స్కూల్ (నాచారం) : నిరుపేద పిల్లల కోసం ఉచిత వసతి, భోజనం, ఒక్యుపేషనల్ థెరపీ, వృత్తి విద్యా శిక్షణ ఇస్తోంది.

(వీరికి వలిగొండలో గ్రామీణ కేంద్రం కూడా ఉంది).

  • ఠాకూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ (దిల్‌సుఖ్‌నగర్) : ఎన్నో ఏళ్లుగా ఉచిత పునరావాస సేవలను అందిస్తోంది.
  • శ్రీ సాయి సేవా సదన్ (ఎర్రగడ్డ) : నిరుపేద పిల్లలకు ఉచిత వసతితో ప్రత్యేక విద్యను అందిస్తోంది.-
  • వికాసం దివ్యాంగ పాఠశాల (ఉట్నూర్) : గిరిజన, నిరుపేద దివ్యాంగ పిల్లల పాలిట వరంగా మారింది.

మచ్చుకకు ఇవి కొన్ని మాత్రమే..

ప్రతీ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘భవిత’ కేంద్రం స్థానికంగా అండగా నిలుస్తున్నాయి.. అక్కడి ప్రత్యేక ఉపాధ్యాయులు ఇలాంటి పిల్లలకు ఉచితంగా ఫిజియోథెరపీ, బేసిక్ లైఫ్ స్కిల్స్ (సొంతంగా తినడం, బ్రష్ చేసుకోవడం వంటివి) నేర్పిస్తారు.. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా అవసరమైన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ టూల్స్, సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు.. విద్యాశాఖ రికార్డుల్లో నమోదైన వేలాది మంది (ప్రాథమిక స్థాయిలో 50,548 మంది, మాధ్యమిక స్థాయిలో 6,605 మంది) ఇలాంటి పిల్లలకు సహాయం అందిండుతోంది..

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. బుద్ధి మాంద్యం అనేది శాపం కాదు… సరైన సమయంలో గుర్తిస్తే, శాస్త్రీయమైన థెరపీలు, ప్రభుత్వ సదుపాయాలు, సమాజం యొక్క ప్రేమతో ఆ పిల్లలు కూడా సమాజంలో ఆత్మగౌరవంతో బతకగలరని తెలుసుకోండి.. మరీ ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థిరత్వం ముఖ్యమే అయినప్పటికీ… ప్రకృతి మన శరీరానికి ఇచ్చిన సమయాన్ని వృథా చేయకూడదు.

సరైన వయసులోనే వివాహం చేసుకోవడం, సంతానాన్ని పొందడం అనేది ఆరోగ్యకరమైన భావితరాలకు అత్యంత కీలకం. అందుకే సమస్య వచ్చిన తర్వాత పునరావాస కేంద్రాలను ఆశ్రయించడం కంటే, సమస్య రాకుండా ముందే జాగ్రత్త పడటం ఎంతో మేలు. యువత ఆధునిక పోకడలకు పోకుండా, శారీరక ఆరోగ్యం బలంగా ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ద్వారానే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని నిర్మించగలము.

- Advertisement -
RELATED ARTICLES

Latest News