Wednesday, June 3, 2026
Homeక్రైమ్ వార్తలుVandalism | షాద్‌నగర్ లో "గ్యాంగ్" ఎటాక్..!

Vandalism | షాద్‌నగర్ లో “గ్యాంగ్” ఎటాక్..!

  • వివేరా హోటల్‌పై దాడి – ధ్వంసం
  • ఘటనపై పరస్పరం కేసులు నమోదు చేసిన పోలీసులు
  • పథకం ప్రకారం ముందస్తుగానే సిసి పుటేజీ వైర్లు ధ్వంసం
  • హోటల్లో కంప్యూటర్, ఫ్రిజ్, ఫర్నిచర్ విలువైన వస్తువులు ధ్వంసం
  • రూ. 4 లక్షల నష్టం
  • పరస్పర దాడులు ఒకరికి తీవ్ర గాయాలు – మరి కొంతమంది పై దాడి
  • పోలీసులు వచ్చిన వదలని వైనం – పోలీస్ స్టేషన్ కు వెళ్లినా వెంటపడి బెదిరింపులు
  • రూ. 1 లక్ష అప్పు విషయంలో చెలరేగిన ఘర్షణ

షాద్‌నగర్ పరిధిలోని కేశంపేట్ ఎక్స్‌రోడ్ సమీపంలో ఉన్న వివేరా హోటల్‌లో ఇటీవలే గత 31న రాత్రి 9 గంటల సమయంలో జరిగిన దాడి, ధ్వంసం సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అప్పు విషయంలో అడగడానికి వచ్చి సంబంధం లేని హోటల్ నిర్వాహకులపై విచ్చలవిడిగా దాడి చేసి మొత్తం హోటల్ నే ధ్వంసం చేసిన సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ హైవే రోడ్డులో ఉన్న వివేరా హోటల్ లో గత 31న రాత్రి 9 గంటల సమయంలో రఘు చారి అదేవిధంగా అతని వెంట కుడుముల మహేందర్, మనోజ్, శివ, రవి, బీరి, ఫయాజ్ తోపాటు పదుల సంఖ్యలో మరి కొంతమంది హోటల్ లో ఉన్న నిర్వాహకుడి సోదరుడు నక్కల ప్రశాంత్ గౌడ్ అప్పు విషయంలో లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని కోపంతో హోటల్ లో ఉన్న అతనిపై దాడికి తెగబడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, మధురాపురం గ్రామానికి చెందిన నక్కల శ్రీధర్ గౌడ్ ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన నిర్వహిస్తున్న వివేరా హోటల్‌కు రఘు చారి తన అనుచరులతో కలిసి వచ్చి, డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు హోటల్‌లో ఉన్న శ్రీధర్ గౌడ్ తమ్ముడు నక్కల ప్రశాంత్ గౌడ్‌పై కర్రలతో దాడి చేయగా, అడ్డుకునేందుకు వెళ్లిన శ్రీధర్ గౌడ్‌పై కూడా దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. అలాగే హోటల్ సిబ్బందిపై దాడి చేసి భయాందోళనలకు గురిచేసినట్లు పేర్కొన్నారు. దుండగులు హోటల్‌లోని అద్దాలు, ఫర్నిచర్, కంప్యూటర్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ ఫ్యూచర్ సిటీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 462/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 118(1), 324(5), 329(3), 352 చదవబడిన 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును ఎస్‌ఐ ఎల్. రాజేశ్వర్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

విధ్వంసం..

రాత్రి 9 గంటల సమయంలో వివేరా హోటల్ కు పెద్ద ఎత్తున ఓ గ్యాంగ్ గా వచ్చిన యువకులు హోటల్ పై అనవసరంగా దాడికి తెగబడ్డారు. ఈ హోటల్ ను నక్కల శ్రీధర్ గౌడ్ నడుపుకుంటున్నాడు. అయితే అతని సోదరుడు ప్రశాంత్ గౌడ్ డబ్బుల వ్యవహారాన్ని ముందుకు తీసుకువచ్చి వారి మధ్య జరిగిన వాగ్వివాదం దాడికి ఉసిగొలిపింది. దీంతో రఘుచారి వెంట వచ్చిన గ్యాంగ్ ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిపై దాడికి దిగారు. ఇందులో హోటల్ కంప్యూటర్, అద్దాలు ఫర్నిచర్ రెండు ఫ్రిజ్ లు ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా ఆత్మ రక్షణకు ప్రశాంత్ గౌడ్ కర్ర సాయంతో రవి పై ప్రతి దాడికి దిగాడు. రవికి తీవ్ర రక్త గాయం కావడంతో గ్యాంగ్ మరింత రెచ్చిపోయింది. హోటల్ లో పూర్తిస్థాయిలో విధ్వంసం చేశారు.

ముందస్తుగా సిసి ఫుటేజ్ కి సంబంధించిన వైర్లను తొలగించారు. బాధితులు 100 డయల్ చేయడంతో అక్కడికి ఇద్దరు పోలీసులు వెంటనే వచ్చారు. వారు బాధితులకు రక్షణ కల్పించేందుకు బాధితులను మొబైల్ వ్యాన్లో కూర్చోబెట్టారు. అయినప్పటికీ వారిని మొబైల్ వ్యాన్ లో నుండి బలవంతంగా బయటికి లాక్కొచ్చి మరి దాడి చేశారు. ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తం అవుతుండడంతో మరో ఎస్సై ప్రవీణ్ రంగ ప్రవేశం చేశారు. బాధితులను పోలీస్ స్టేషన్ కు తరలించి రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేయగా చాలామంది పోలీస్ స్టేషన్ వరకు వారిని వెంబడించారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి కూడా వారిపై బెదిరింపులకు దిగారు. బాధితులు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తిరిగి ఫోన్ చేసి జరిగిన పరిస్థితినీ వివరించగా పోలీసులకు వివరించగా వారు కఠిన చర్యలు తీసుకోవడంతో గ్యాంగ్ అక్కడి నుండి వెళ్లిపోయింది.

మరో కేసు నమోదు..

హోటల్ విధ్వంసం వ్యవహారంలో జరిగిన పరస్పర దాడుల వ్యవహారంలో ఆత్మ రక్షణ కోసం ప్రయత్నించి అవతలి వారిపై దాడికి దిగిన నక్కల శ్రీధర్ గౌడ్ అతని సోదరుడు ప్రశాంత్ గౌడ్ మరొకరిపై స్థానిక పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా పబ్లిక్ చూస్తుండగానే చాలాసేపు హోటల్ వద్ద సృష్టించిన బీభత్సం భయానక వాతావరణం చూసి ప్రజలు హడలిపోయారు. యువతకు పట్టపగ్గాలు లేనట్టు చేస్తున్న హైడ్రామా చూసి స్థానికులు అవక్కయ్యారు.

మరోవైపు పోలీసులు వచ్చి నచ్చజెప్పినా కూడా ఇలాంటి భయము బెరుకు లేకుండా బాధితులను కొట్టిన తీరును స్థానికులు సంఘటన స్థలం వద్ద ప్రస్తావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసులు గాని ఇటు బాధితులు గాని బయటికి చెప్పకపోవడంతో ఈ ఘటనపై పట్టణంలో రకరకాలుగా చర్చిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకొని వాటి వివరాలను మీడియాకు కూడా తెలియనివ్వకపోవడంతో అసలు సంఘటన ఏం జరిగిందని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ జోక్యం..

వివేరా హోటల్ ధ్వంసం ఘటన కేసుల నమోదు తర్వాత ఇందులో అన్యోన్యంగా రాజకీయాలు జోక్యం చేసుకున్నాయి. సదరు హోటల్ ఓ బిఆర్ఎస్ నాయకుడికి చెందినది కావడంతో అవతలి వ్యక్తులు దానిని ఆసరాగా తీసుకొని దీనికి రాజకీయాన్ని జోడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక్కడ ఒక పార్టీ ఉంటే అటు మరో పార్టీ వారిని రంగంలోకి దించి దీనిని పెద్ద ఎత్తున రాజకీయం చేసేందుకు నిందితులు కుట్ర చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ ప్రజా ప్రతినిధి మరి కొంతమంది నాయకులు ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయి కేసులు వద్దు రాజు చేసుకుందామని స్థాయికి వచ్చారు.

అసలు డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనే విషయం కాకుండా ఒక వ్యాపార సంస్థపై అందరూ చూస్తుండగానే నిస్సిగ్గుగా దాడి చేసి మొత్తం దోషం చేసిన ఘటనపై పోలీసులు ఎవరెవరిని అరెస్టు చేశారు కూడా ఇప్పటివరకు తెలియదు. ఇలాంటి ఘటనలు సమాజానికి చెడ్డ పేరు తెస్తాయి. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఈ పట్టణంలో ఇలాంటి అలజడులు సృష్టించడం ఎంతవరకు సమంజసం పోలీసులు నిర్ణయించాలి. ఇకపోతే సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి దాడులు దౌర్జన్యాల వ్యవహారంలో రాజకీయాలు పనికిరావు ముందు లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఇలాంటి దాడులకు తెగబడే వారిని పోలీసులు కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే బైండోవర్, ఇలాగే భవిష్యత్తులో చేస్తే మాట వినకపోతే రౌడీషీట్లు తెరవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే ఇలాంటివి యువతకు అలవాటయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎవరి పని వారు చేసుకుని వ్యాపారం చేసుకునే వారి వద్దకు వెళ్లి దాడులు దౌర్జన్యాలకు తెగబడి దానిని ఆసరాగా చేసుకొని రాజకీయ అండలతో కౌంటర్ కేసులు చేయించుకుని లేదా దెబ్బలు తగిలాయని వాటిని ముందుకు పెట్టి అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం లేకపోలేదు. పోలీసులే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News