- చాట్ జీపీటీ, జెమినీ సాయంతో సైబర్ యుద్ధం..
అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్.. పశ్చిమ దేశాల సాంకేతికతనే ఆయుధంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ హ్యాకర్లు ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘జెమినీ’ వంటి ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను వాడుకుంటున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. వీటి సాయంతో ప్రమాదకరమైన మాల్వేర్లను తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలతో సైబర్ యుద్ధానికి తెరలేపినట్లు పేర్కొంది. ఆ కథనం ప్రకారం..
ఇరాన్ సైబర్ ముఠాలు ఏఐ సాంకేతికతతో ఇంటర్నెట్లో నకిలీ వ్యక్తులను సృష్టిస్తున్నాయి. ఈ ఫేక్ ప్రొఫైళ్లతో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ రంగ అధికారులతో చాట్ చేస్తూ వారిని నమ్మిస్తున్నాయి. తర్వాత మెల్లగా ప్రమాదకరమైన లింకులను పంపి సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలను మోసం చేయడానికి ఏఐ సాయంతో పక్కాగా హిబ్రూ, అరబిక్ భాషల్లో ఫిషింగ్ మెసేజ్‌లు, ఈమెయిళ్లను పంపుతున్నారు. ఈ క్రమంలోనే యూఏఈ కూడా తాము రోజుకు ఐదు లక్షలకు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటున్నామని, అందులో చాట్‌జీపీటీ సాయం ఉన్నట్లు గుర్తించామని ప్రకటించింది.
ప్రముఖ టెక్ కంపెనీలు ఈ దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ హ్యాకర్లు కొత్త దారులను వెతుకుతున్నారు. గత ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌కు చెందిన ‘APT42’ అనే హ్యాకర్ల ముఠా గూగుల్ జెమినీ ఏఐ మోడల్‌ను వాడుతున్నట్లు గూగుల్ స్వయంగా గుర్తించింది. అమెరికాకు చెందిన అత్యంత శక్తిమంతమైన ‘F-35’ యుద్ధ విమానాలకు సంబంధించిన పరిశోధనలు, సమాచారాన్ని సేకరించడానికి వారు ఈ ఏఐని వాడినట్లు తేలింది. దీంతో అలర్ట్ అయిన గూగుల్, యూట్యూబ్ ఆయా ఖాతాలను నిషేధించాయి.
