- ఇరుదేశాల తాత్కాలిక ఒప్పొందంపై నీలినీడలు..
- కొన్ని కఠిన షరతులు విధించిన ట్రంప్..
ఇరాన్‌తో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన వైట్‌హౌస్‌లో జరిగిన కీలక సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీ నుంచి ట్రంప్ ఏ నిర్ణయం ప్రకటించకుండానే వెళ్ళిపోయారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య కుదిరిందని భావించిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఈ సమావేశానికి ముందు ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇరాన్‌తో ఒప్పందం జరగాలంటే కొన్ని కఠిన షరతులు విధించారు. సంఘర్షణల కారణంగా మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలన్నది కూడా తమ ప్రధాన షరతుల్లో ఒకటని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా పెడుతున్న ఈ షరతులను ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది.
ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, అమెరికా తన కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. “అవసరమైతే దాడులను పునఃప్రారంభించే సామర్థ్యం మాకుంది. మా ఆయుధ నిల్వలు అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్ ఒక మంచి ఒప్పందం కోరుకుంటున్నారని, కానీ ఇరాన్ అణు ఆశయాలను అరికట్టేలా అది ఉండాలని స్పష్టం చేశారు.
