- లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడ్డ భరత్ నాయక్..
- అగ్రశ్రేణి రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలున్నాయంటాడు..
- మంత్రులు సైతం తన మాట వింటారని నమ్మిస్తాడు..
- ఆదాబ్‌ను ఆశ్రయించి, ఆధారాలు ఇచ్చిన బాధితులు..
- తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అని
- విజిటింగ్ కార్డులు ముద్రించుకుని దర్జాగా వైట్ కాలర్ మోసాలు..
తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తనను తాను తప్పుడు ప్రచారం చేసుకుంటూ, ఆ హోదాని అడ్డం పెట్టుకుని ప్రజల్లో నమ్మకం సంపాదించాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. సచివాలయం, హైడ్రా, జీహెచఎంసీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. కేవలం ఉద్యోగాలే కాకుండా, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజలను సైతం మోసగించాడు. బాధితుల అవసరాన్ని బట్టి ఒక్కొక్కరి నుండి రూ. 50 వేల నుండి రూ. 3 లక్షల వరకు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన కేతావత్ భరత్ నాయక్ అసలు స్వరూపాన్ని బయటపెడుతూ, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు తీవ్ర ఆరోపణలతో ఆదాబ్ ముందుకు వచ్చారు..

రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, మంత్రులు తన మాట వింటారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తనను తాను ప్రచారం చేసుకుంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన కేతావత్ భరత్ నాయక్‌పై పలువురు బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల వాదన ప్రకారం.. భరత్ నాయక్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, హైడ్రా, జీహెచఎంసీ, సచివాలయం తదితర విభాగాల్లో పోస్టులు కల్పిస్తానని నమ్మబలికి పలువురి నుంచి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మహేష్ అనే యువకుడు మాట్లాడుతూ..
2023లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తన వద్దకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించాడు. అందులో రూ.15 వేలు ఫోన్‌పే ద్వారా, మిగతా రూ.35 వేలు నగదుగా ఇచ్చినట్లు తెలిపాడు. హైడ్రాలో ఉద్యోగం ఖాయం.. త్వరలో ఆఫర్ లెటర్ వస్తుంది.. కంగ్రాట్యులేషన్స్ అంటూ నెలల తరబడి నమ్మించాడని, ఏడాది గడిచినా ఉద్యోగం రాకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. బాధితుల అంచనా ప్రకారం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, కొత్తగూడెం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 20 నుంచి 30 మంది వరకు ఈ మోసానికి గురైనట్లు తెలుస్తోంది.

జాబ్‌ను బట్టి రేట్లు కూడా నిర్ణయించేవాడని బాధితులు చెబుతున్నారు… హైడ్రాలో ఉద్యోగం కావాలంటే రూ.2 లక్షలు.. జీహెచఎంసీలో ఉద్యోగం కోసం రూ.1.5 లక్షలు.. సచివాలయంలో ఉద్యోగం కావాలంటీజ్ రూ.3 లక్షలు.. ఇక ఇందిరమ్మ ఇల్లు కావాలంటే రూ.2 లక్షలు.. వికలాంగులకు పింఛన్ కావాలంటే రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు అంటూ ఒక రేట్ మెనూ తయారు చేసి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఇద్దరు వికలాంగుల నుంచి పింఛన్ ఇప్పిస్తానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పి రూ.50 వేల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
పింఛన్ కోసం అప్పులు చేసి డబ్బులు ఇచ్చామని, సంవత్సరం గడిచినా పని జరగకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హోదాలో విజిటింగ్ కార్డులు ముద్రించుకొని, ప్రముఖ రాజకీయ నాయకులు, మంత్రులతో దిగిన ఫోటోలను చూపిస్తూ.. బాధితులను నమ్మించాడని ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో అప్‌కమింగ్ ఎమ్మెల్యే 2029, వికలాంగుల చైర్మన్ వంటి ప్రచార పోస్టులు సృష్టించి తనకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లు ప్రచారం చేసుకున్నాడని బాధితులు చెబుతున్నారు.
జీహెచఎంసీ, హైడ్రా ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ పార్టీ లెటర్‌ప్యాడ్లు, స్టాంపులు ఉపయోగించి నకిలీ దరఖాస్తులు, సిఫారసు పత్రాలు రూపొందించినట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో బాధితులు ఆదాబ్ హైదరాబాద్‌కు కొన్ని పత్రాలు, ఫోన్‌పే లావాదేవీల స్క్రీన్‌షాట్లు, ఆడియో రికార్డింగులు సమర్పించి తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రాధేయపడ్డారు.భరత్ నాయక్‌పై సూర్యాపేట పోలీస్ స్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు గణనీయమైన చర్యలు కనిపించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో రాజకీయ అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆశలను ఆసరాగా చేసుకొని అమాయకులను మోసం చేసే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించి, భరత్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
