- మహాభారతంతో అనుబంధం ఉన్న ఉత్తరప్రదేశ్లోని పవిత్ర క్షేత్రం..
- మహాభారతంతో అనుబంధమున్న ప్రదేశం..
సాధారణంగా మనకు త్రివేణి సంగమం గురించి తెలుసు అలాగే నదులు సాగరంలో కలిసే సాగర సంగమం గురించి కూడా తెలుసు. కానీ పంచ నదులు అంటే అయిదు నదులు ఒకే చోట కలిసే పంచనద సంగమం గురించి తెలుసా! మహాభారతంలో పాండవులు సంచరించిన పవిత్ర ప్రదేశమైన ఈ పంచనద సంగమం విశేషాలు మీకోసం..
సాధారణంగా ఎక్కడైనా రెండు లేదా మూడు నదుల సంగమం చూస్తాం. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత క్షేత్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఉన్నఈ పంచనద సంగమం అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక అద్భుతానికి వేదికగా నిలుస్తోంది. జలౌన్, ఇటావా జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఐదు ప్రధాన నదులు సంగమిస్తాయి. పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ పంచనద సంగమం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ లోని ఇటావా జిల్లాలోని పంచనద పవిత్ర సంగమ ప్రదేశం వద్ద యమున, చంబల్, క్వారీ, సింధ్, పహుజ్ అనే ఐదు పవిత్ర నదులు సంగమిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి. ప్రపంచంలోనే మరెక్కడా ఇన్ని నదులు ఒకేచోట సంగమించడం కనిపించదు.
అందుకే అరుదైన ఈ పంచనద సంగమాన్ని మహా సంగమమని అంటారు. విశేషమేమిటంటే ఈ ఐదు నదులు వేర్వేరు రంగులలో స్పష్టంగా కనిపిస్తూ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య తిధులైన అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి వంటి తిథుల్లోనూ, కార్తిక, మాఘ, వైశాఖ మాసాలల్లోను, అలాగే గ్రహణ సమయాల్లోనూ ఈ పంచనద సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. అలాగే ఈ సంగమంలో కనిపించే ఐదు నదుల్లో ఏ నదికి పుష్కరాలు వచ్చినా భక్తులు ఈ సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి తరలి వస్తుంటారు.
