- ప్రాణాలకు పెను ముప్పు..
- డెత్ జోన్ లో కరువైన ప్రాణవాయువు..
అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం చాలామందికి ఒక కల. కానీ ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ప్రాణాలకే ముప్పు తెచ్చే ఒక ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. అదే ‘డెత్ జోన్’. సముద్ర మట్టానికి 8,000 మీటర్ల ఎత్తు దాటిన తర్వాత మొదలయ్యే ఈ ప్రాంతంలో, ప్రాణవాయువు కొరతతో మానవ శరీరం నిమిషనిమిషానికీ క్షీణించడం మొదలవుతుంది. ఈ ఏడాది సీజన్లో ఇద్దరు భారతీయ పర్వతారోహకులతో సహా కనీసం ఐదుగురు ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు.
డెత్ జోన్లో గాలిలో ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం మూడో వంతు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ‘హైపోక్సియా’ ఏర్పడి, మొదట మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో గందరగోళం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, భ్రాంతులు కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సప్లిమెంటరీ ఆక్సిజన్ లేకుండా శిఖరంపైకి చేరితే, కేవలం 4 నిమిషాల్లో స్పృహ కోల్పోయి, 6 నిమిషాల్లో మరణం సంభవిస్తుంది. దీంతోపాటు మెదడు వాపు, ఊపిరితిత్తులలో నీరు చేరడం వంటి ప్రాణాంతక సమస్యలు కూడా తలెత్తుతాయి. శరీరం తనను తానే తినేస్తూ, కండరాలు బలహీనపడతాయి.
