- కేబినెట్ మంత్రి ఆదేశాలు సైతం లెక్కచేయరా..?
- కోట్ల రూపాయల ధాన్యం మాయమైనా…ఇంతటి నిర్లక్ష్యమా!
- మిల్లులపై కేసులు సరే… కస్టోడియన్ సంగతేంటి..?
- డీఎస్ఓపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
- ఉన్నతాధికారుల తీరుపై డిఓపిటిలో ఫిర్యాదు చేస్తాం
- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అకతవకలు, రైస్ మిల్లులో ధాన్యం బస్తాల మాయంపై సివిల్ సప్లయ్ అధికారుల అవినీతి జిల్లా కలెక్టర్ గారికి కనిపించడం లేదా? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ధాన్యం మాయం చేసిన మిల్లులపై కేసులు నమోదు చేశారే కానీ అన్నింటికీ బాధ్యుడైన డిఎస్ఓపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కలెక్టర్ చెప్పాలన్నారు.
నవంబర్ నెలలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి జిల్లాలోని వారాహి, చాముండి రైస్ మిల్లులు సీజ్ చేసి కేసు నమోదు చేశారన్నారు. ఈ రెండు మిల్లులకు డిఎస్ఓ కస్టోడీయన్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సరిగ్గా 6 నెలల తరువాత టాస్క్ ఫోర్స్ అధికారులు మళ్ళీ అదే మిల్లులపై తనిఖీలు జరుపగా రూ. 9 కోట్లకు పైగా ధాన్యం బస్తాలు మాయం అయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. గతంలో కేసు అయినప్పటికీ రెండు మిల్లులలో ఉన్న ధాన్యాన్ని కస్టోడీయన్ గా ఉన్న డిఎస్ఓ ఎందుకు షిఫ్ట్ చేయలేదని, ఆయన అండదండలతోనే ఈ తతంగం జరిగిందని ఆరోపించారు.
పైగా సీజ్ చేసిన మిల్లులో డీఎస్ఓ (కస్టోడీయన్) కు తెలియకుండా ధాన్యాన్ని తరలించడం మరియు మిల్లింగ్ చేయడం అసాధ్యం అని, దీనిపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలన్నారు. జిల్లాలోని ఉన్నతాధికారుల అండదండలు డీఎస్ఓకు సంపూర్ణంగా ఉన్నాయని, ఉన్నతాధికారుల బంధువులకు సివిల్ సప్లయ్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించే వ్యక్తి ద్వారా భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బీసీ పొలిటికల్ జేఏసీ సేకరించడం జరిగిందని, ఉన్నతాధికారుల పరువు తీయకూడదనే సదుద్దేశంతో వారి వివరాలు బయట పెట్టడం లేదని తెలిపారు.
ఇంత పెద్ద అవినీతిపరుడైన డీఎస్ఓను ఎందుకు వెనకేసుకొస్తున్నారో జిల్లా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. తనకు అనుకూలంగా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం పంపించడం, తనకు నచ్చని మిల్లులకు ధాన్యం కేటాయించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ డిఎస్ఓ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. దాదాపు నాలుగైదు కొత్త రైస్ మిల్లులకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సాక్షాత్తు కేబినెట్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఏకంగా సివిల్ సప్లయ్ కమిషనర్ డీఎస్ఓను సరెండర్ చేయమంటే కూడా కలెక్టర్ ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. సివిల్ సప్లయ్ అధికారి తీరు వల్ల పలు విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా స్పందించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుంటే ఉన్నతాధికారుల తీరుపై ఢిల్లీలోని డిఓపిటిలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కృష్ణప్రసాద్, యశ్వంత్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు
